రాజస్థాన్‌లో అరుదైన పక్షయిన ‘గోడావన్’ (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్)ను పరిరక్షించే ప్రయత్నంలో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది.
సంతానోత్పత్తి కేంద్రంలో పెంచబడిన 6 నెలల మగ గోడావన్ పక్షి, అడవిలో వదిలిన కేవలం నాలుగు రోజులకే నక్క చేతిలో హతమైంది. దీంతో, మిగిలిన ఏడు పక్షులను అడవిలోకి వదిలే ప్రణాళికను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్రాంతంలో ఉన్న డిసర్ట్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన జరిగింది. ప్రత్యేక కేంద్రంలో పెంచబడిన ఆ పక్షి అక్టోబర్ 14న అడవిలో వదిలివేయబడింది. అక్టోబర్ 18న నీరు తాగడానికి ఒక నీటి వనరు దగ్గరకు వెళ్లినప్పుడు దానిని నక్క దాడి చేసినట్లు తెలుస్తోంది. పక్షి శరీరంలో అమర్చిన శాటిలైట్ ట్రాకింగ్ పరికరం ద్వారా దాని కదలికలను గమనిస్తున్న అటవీ శాఖ అధికారులకు, సిగ్నల్ ఆగిపోవడంతో అనుమానం వచ్చింది. సంఘటనా స్థలానికి వెళ్లిన బృందం పక్షి ఈకలు, శరీర అవశేషాలను కనుగొన్నారు. ట్రాకింగ్ పరికరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ లభించిన రక్త నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపారు.
మొత్తం 11 గోడావన్ పక్షులను దశలవారీగా అడవిలో వదలాలని ప్రణాళిక రూపొందించారు. అక్టోబర్ 4న కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ రెండు పక్షులను అడవిలో వదిలారు. ఆ తర్వాత అక్టోబర్ 14న మరో రెండు మగ పక్షులను వదిలారు. వీటిలో ఒక పక్షి నక్క బారిన పడగా, మిగతా మూడు పక్షులు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో, మిగిలిన ఏడు పక్షులను అడవిలో వదిలే పథకాన్ని వాయిదా వేశారు.
ఇండియన్ వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్, గోడావన్ పక్షులను అడవిలోకి వదిలే విధానాలు మరియు భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తోంది. పరిశీలన పూర్తయిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. అడవిలో ఒక జంతువు మరొక జంతువును వేటాడటం సహజమైన విషయమేనని, గోడావన్ పక్షులను పర్యవేక్షించే పనులు నిరంతరం కొనసాగుతున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. రాజస్థాన్ రాష్ట్ర పక్షయిన గోడావన్ను రక్షించే ఈ ప్రయత్నంలో, ఈ సంఘటన తర్వాత నిఘా మరియు భద్రతా ఏర్పాట్లను మెరుగుపరచడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a Reply