బీహార్‌లో అర్ధరాత్రి వేళల్లో మహిళల హెల్ప్‌లైన్ నంబర్ 181కి వస్తున్న ఫోన్ కాల్స్‌కు సంబంధించి వెలువడిన సమాచారం తీవ్ర గమనార్హంగా మారింది.
అక్కడి మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ గణాంకాల ప్రకారం, ఒక నెలలో వచ్చిన 1,278 కాల్స్‌లో సుమారు 57 శాతానికి పైగా, అంటే 731 కాల్స్ రాత్రి సమయంలోనే నమోదయ్యాయి.
పగటి వేళల్లో కుటుంబ సభ్యులకు తెలిసిపోతుందేమోననే భయం, సంకోచంతో ఉండే యువతులు.. ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత రాత్రి వేళల్లో ఈ నంబర్‌కు ఫోన్ చేస్తున్నారు. ప్రియుడి నిర్లక్ష్యం, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం, ప్రేమ వ్యవహారాల్లో గొడవలు మరియు ఇంట్లో బలవంతపు పెళ్లిళ్లు చేయడం వంటి సమస్యలతో మానసిక ఆందోళనకు గురవుతున్న మహిళలు తమ బాధలను పంచుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
తాము ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కుటుంబ సభ్యులు అంగీకరించనప్పుడు, అలాగే వేరే చోట పెళ్లి చేసుకోవాలని ఇంట్లో ఒత్తిడి తెస్తున్నప్పుడు.. తదుపరి ఏమి చేయాలో తోచక మహిళలు ఈ హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. సామాజిక ఒత్తిడి, కుటుంబ వ్యతిరేకత కారణంగా తమ ఆవేదనను బహిరంగంగా చెప్పుకోలేని మహిళలకు ఈ హెల్ప్‌లైన్ నంబర్ పెద్ద ఊరటగా మారింది.
ఈ హెల్ప్‌లైన్‌కు వచ్చే అన్ని కాల్స్‌పై వెంటనే పోలీసులు చర్యలు తీసుకోరు. చాలా కేసుల్లో యువతులకు కావలసిన మానసిక కౌన్సెలింగ్, చట్టపరమైన మార్గదర్శకాలను మాత్రమే అందిస్తారు. అత్యంత తీవ్రమైన లేదా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్న కేసుల్లో మాత్రమే పోలీసులు మరియు ఇతర ప్రభుత్వ శాఖల సహాయం తీసుకుంటారు.
మహిళలకు అత్యవసర సహాయం, కౌన్సెలింగ్ మరియు భద్రతా సూచనలను అందించడానికి ఈ 181 హెల్ప్‌లైన్ నంబర్ బీహార్‌లోని 38 జిల్లాల్లోనూ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. ఏదైనా తక్షణ ప్రమాదం ఎదురైతే మహిళలు 112 నంబర్‌ను కూడా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

Leave a Reply