మధ్యప్రదేశ్: సత్నా జిల్లా రాంపూర్ బాఘేలాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవమౌ జిరియా తోలా గ్రామంలో మానవ సంబంధాలను మంటగలుపుతూ ఒక మనవడు తన బామ్మనే హత్య చేసిన ఘటన కలకలం రేపింది.
ఘటన వివరాలు: శివబహదూర్ రావత్ కుమారుడు కయామత్ రావత్ (20), తన 25 ఏళ్ల అత్త (వరుసకు పిన్ని/అత్త) భారతి అలియాస్ కాంచన్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఫిబ్రవరి 5వ తేదీన వీరిద్దరూ ఏకాంతంగా ఉండటాన్ని కయామత్ బామ్మ రుక్మిణి ఆదివాసి కళ్లారా చూసింది. ఈ విషయం బయటకు తెలిస్తే కుటుంబ గౌరవం పోతుందని, సమాజంలో తలెత్తుకోలేమని భావించిన అత్తా-మనవళ్లు.. బామ్మను అడ్డుతొలగించుకోవాలని పథకం వేశారు.
బామ్మ రుక్మిణి ప్రకృతి నివృత్తి కోసం వెళ్లిన సమయంలో కయామత్ ఆమెను వెంబడించి దాడి చేశాడు. తన చేతికి ఉన్న కడియంతో ముఖంపై బలంగా కొట్టి, ఆపై ఇనుప కడ్డీతో ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని పొదల్లో దాచిపెట్టాడు. మరుసటి రోజు మృతదేహం లభ్యం కావడంతో, పోస్టుమార్టం నివేదికలో ఆమె గొంతు నులిమి హత్యకు గురైనట్లు తేలింది. సైబర్ సెల్ సాయంతో విచారణ చేపట్టిన పోలీసులు, అనుమానంతో అత్తా-మనవళ్లను ప్రశ్నించగా వారు నేరాన్ని ఒప్పుకున్నారు. ప్రస్తుతం వారిద్దరూ జైలులో ఉన్నారు.
