మైన్‌పురి: ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకపక్ష ప్రేమ ఉన్మాదంతో ఒక 12వ తరగతి విద్యార్థి తన మాజీ ఉపాధ్యాయురాలిపై ప్రాణాంతక దాడికి పాల్పడ్డాడు.
నిందితుడు పదునైన ఆయుధంతో దాడి చేసి ఉపాధ్యాయురాలి రెండు పెదవులను కోసేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం ఆగ్రాలోని ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
అసలేం జరిగింది? నిందితుడైన అఖండ ప్రతాప్ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన మైన్‌పురి నగరంలోని కొత్వాలి ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలు ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. నిందితుడు అదే పాఠశాలలో చదువుతూ ఆమెపై కన్నేశాడు. తరచుగా అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీనిపై ఉపాధ్యాయురాలు ‘పేరెంట్స్-టీచర్స్ మీటింగ్’లో అతని తల్లికి ఫిర్యాదు చేశారు. తన కుమారుడు మళ్ళీ ఇలాంటి పనులు చేయడని ఆమె హామీ ఇచ్చారు, కానీ ఆ విద్యార్థిలో మార్పు రాలేదు.
వేధింపులు భరించలేక ఉద్యోగం మానేసిన మేడమ్ విద్యార్థి వేధింపులు తట్టుకోలేక ఆమె ఆ పాఠశాలను వదిలి జ్యోతి రోడ్డులోని మరో ప్రైవేట్ స్కూల్‌లో చేరారు. అయినప్పటికీ ఆ ఉన్మాది వదలలేదు. కొత్త పాఠశాలకు వెళ్లే దారిలో కూడా ఆమెను వెంబడించేవాడు. దారి కాచి వేధించేవాడు. తాజాగా ఆమెను అడ్డుకుని, బలవంతంగా లాక్కెళ్లి పదునైన ఆయుధంతో ముఖంపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె పెదవులు తెగిపోయి రక్తపు మడుగులో పడిపోగా, నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
పోలీసుల స్పందన బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కొత్వాలి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని సిఓ సిటీ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు.
