తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. దివంగత నటుడు రోబో శంకర్ కుమార్తెను సినిమాలో తిట్టారని పేర్కొంటూ డీఎంకే నేతలు తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యంలో, దీనిపై ఇంద్రజ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ తమ పార్టీ అభ్యర్థి సత్యభామను బాడీ షేమింగ్ (శరీరాకృతిని కించపరచడం) చేశారని, దీనిపై తాము ఫిర్యాదు కూడా చేయబోతున్నామని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ తరుణంలోనే, విజయ్ కూడా బిగిల్ సినిమాలో రోబో శంకర్ కుమార్తెను బాడీ షేమింగ్ చేశారని డీఎంకే నేతలు ఆరోపిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
దీనిపై డీఎంకే మాజీ ఎంపీ అబ్దుల్లా కూడా నటుడు విజయ్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. “బిగిల్ సినిమాలో నటుడు విజయ్, రోబో శంకర్ కూతుర్ని ఏదో ఒక మాట అని పదేపదే తిడుతుంటారే.. ఆ పదం ఏమిటో గుర్తుందా?” అని ఆయన ఆ పోస్ట్‌లో ప్రశ్నించారు. కేవలం సినిమాలో వచ్చే ఒక సన్నివేశాన్ని అడ్డం పెట్టుకుని డీఎంకే నేతలు రాజకీయం చేస్తున్నారని టీవీకే నాయకులు విమర్శిస్తున్న తరుణంలో.. దీనిపై నటి ఇంద్రజ గతంలో ఇచ్చిన పాత ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “గుండమ్మ అనేది దర్శకుడు అట్లీ రాసిన స్క్రిప్ట్. కానీ విజయ్ అన్న ఎంతో వినయంగా నా దగ్గరకు వచ్చి, సినిమాలో ఆ మాట అనడం నీకు ఓకేనా? అని అడిగి మరీ క్షమాపణలు చెప్పారు. అట్లీ రాసిన ఒక డైలాగ్ కోసం విజయ్ అన్న నా దగ్గర క్షమాపణలు కోరారు” అని ఆమె చెప్పారు. కాగా, ఈ వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్న టీవీకే మద్దతుదారులు, విజయ్ అభిమానులు.. డీఎంకే నేతలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు.

Leave a Reply