కొన్నిసార్లు మనం తీసుకునే తొందరపాటు లేదా ఆలోచన లేని నిర్ణయాలు మన ప్రాణాలకే ప్రమాదంగా మారుతాయనడానికి న్యూజిలాండ్‌లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన షాకింగ్ ఉదాహరణగా నిలిచింది. 27 ఏళ్ల యువతి వాంతి చేసుకోవడానికి ప్రయత్నించగా, అనుకోకుండా తన చేతిలో ఉన్న పూర్తి ఫోర్క్‌ను (ముళ్ల చెంచా) మింగేసింది.
వెంటనే ఆమెను ఆసుపత్రి అత్యవసర విభాగంలో చేర్చగా, తీసిన ఎక్స్-రే పరీక్షలో కడుపులో పూర్తి ఫోర్క్ ఇరుక్కుపోయి ఉండటం చూసి వైద్య బృందమే నివ్వెరపోయింది.
న్యూజిలాండ్‌లోని వైకాటో ఆసుపత్రిలో జరిగిన ఈ చికిత్స సమయంలో, పెద్ద పరిమాణంలో ఉన్న ఆ ఫోర్క్‌ను చుట్టుపక్కల అవయవాలకు ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా బయటకు తీయడం వైద్యులకు పెద్ద సవాలుగా మారింది.
ఆక్లాండ్ విశ్వవిద్యాలయం సర్జరీ సీనియర్ లెక్చరర్ డాక్టర్ జెస్సీ ఫిషర్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఒక సామాజిక కార్యక్రమంలో ఈ సంఘటన జరిగిందని, ఆ యువతి ఎందుకు వాంతి చేసుకోవడానికి ప్రయత్నించింది లేదా ఇది ఏదైనా సరదా పందెం వల్ల జరిగిందా అనేది స్పష్టంగా తెలియదని పేర్కొన్నారు.
ముందుగా శస్త్రచికిత్సను నివారించే ఉద్దేశంతో ఎండోస్కోపీ పద్ధతిలో నోటి ద్వారా రెండుసార్లు తీయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో సుమారు 4 సెంటీమీటర్ల చిన్న కోత పెట్టి కీహోల్ సర్జరీ ద్వారా వైద్యులు ఆ ఫోర్క్‌ను విజయవంతంగా తొలగించారు.
అదృష్టవశాత్తూ ఆ ఫోర్క్ వల్ల కడుపులో ఎలాంటి గాయం (చిరుగుదల) కాలేదని, ఆ యువతికి ఎలాంటి ఆహార సంబంధిత రుగ్మతలు లేదా మానసిక సమస్యల చరిత్ర లేదని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స జరిగిన కేవలం రెండు రోజుల్లోనే ఆమె ఆరోగ్యంలో మంచి పురోగతి కనిపించి, సాధారణంగా ఆహారం తీసుకునే స్థితికి చేరుకుని డిశ్చార్జ్ అయింది.
ఈ ఘటన నేపథ్యంలో, బయటి వస్తువులను మింగడం లేదా శరీరంతో ప్రమాదకరమైన ప్రయోగాలు చేయడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని, ఇలాంటి సమయాల్లో సొంత వైద్యం లేదా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం పొందాలని వైద్యులు సూచించారు.

Leave a Reply