మనుషుల మెదడు, నాడీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో పూర్తిగా అర్థం చేసుకోవడం నేటికీ విజ్ఞాన శాస్త్రానికి ఒక సవాలుగానే మిగిలిపోయింది.
ముఖ్యంగా, మన మెదడులోని ఒక చిన్న భాగంలో జరిగే నష్టం లేదా శస్త్రచికిత్సలు కూడా మనిషి మొత్తం దృష్టిని, ప్రపంచాన్ని చూసే కోణాన్ని పూర్తిగా మార్చేయగలవు. ఇందుకు నిదర్శనంగా ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ వైద్య ఘటన ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడమే కాకుండా, అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
అమెరికాకు చెందిన 28 ఏళ్ల యువకుడు మెదడులోని రక్తనాళాల సమస్య కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ ఆపరేషన్ విజయవంతంగా ముగిసి అతను సాధారణ జీవితానికి తిరిగి వచ్చాడని అందరూ అనుకుంటున్న తరుణంలో, అతనికి ఒక వింతైన, నమ్మశక్యం కాని దుష్ప్రభావం (సైడ్ ఎఫెక్ట్) ఎదురైంది.
అతను బయటకు వెళ్లినప్పుడో లేదా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడో ఎదురుగా ఉన్నవారి ముఖాలు అతనికి సరిగ్గా కనిపించడం లేదు. దానికి బదులుగా, తను పెంచుకుంటున్న ‘లూనా’ అనే పెంపుడు పిల్లి కళ్ళు, దాని ముఖంపై ఉన్న గీతలు ఎదురుగా ఉన్న వ్యక్తుల ముఖాలపై కనిపిస్తున్నాయి.
వైద్య పరిభాషలో ‘ప్రోసోపోమెటామార్ఫాప్సియా’ (Prosopometamorphopsia) అని పిలువబడే ఈ అత్యంత అరుదైన రుగ్మత, మెదడులో ముఖాలను గుర్తించే భాగంలో జరిగే నష్టం వల్ల వస్తుంది. కొన్నిసార్లు మనుషుల ముఖాల్లో పిల్లి ఆకారాలు, తన పిల్లిని చూసినప్పుడు మనుషుల ముఖాలు కనిపిస్తున్నాయని ఆ యువకుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ వింత వ్యాధితో బాధపడుతున్న అతన్ని పరీక్షిస్తున్న వైద్యులు.. మెదడు దాచుకున్న పాత జ్ఞాపకాలు, ప్రస్తుత చూపు ఒకదానితో ఒకటి ఎలా కలగాపులగమై గందరగోళానికి గురిచేస్తాయనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply