న్యూఢిల్లీ: PSL 2026 ముగిసిన వెంటనే పాకిస్తాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య మీర్పూర్లో మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
తొలిరోజు ఆటలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో అద్భుత శతకం బాదాడు. ఇక రెండో రోజు ముష్ఫికర్ రహీమ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. అయితే, అతను సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.
ఆట రెండో రోజు అంతా సజావుగానే సాగుతున్న సమయంలో, బ్రాడ్‌కాస్టర్ చేసిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బంగ్లాదేశ్-పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ బ్రాడ్‌కాస్టర్ అయిన ‘ఫాక్స్’ (Fox), లైవ్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల పేర్లతో కూడిన గ్రాఫిక్స్‌ను ప్రదర్శించింది. ఆ గ్రాఫిక్స్‌లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్ వంటి భారత ఆటగాళ్ల పేర్లు ఉండగా, జట్టు పేరు మాత్రం ‘పాకిస్తాన్’ అని ఉంది. చూస్తుంటే, ఇది భారత టీ20 జట్టుకు సంబంధించిన పాత గ్రాఫిక్స్‌లా కనిపిస్తోంది.
417 పరుగులకు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ సమాప్తం
మీర్పూర్ టెస్ట్ రెండో రోజు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 417 పరుగుల వద్ద ముగిసింది. బంగ్లాదేశ్ తరపున శాంటో 130 బంతుల్లో 101 పరుగులు చేశాడు (12 ఫోర్లు, 2 సిక్సర్లు). ముష్ఫికర్ రహీమ్ 179 బంతుల్లో 71 పరుగులు చేయగా, మోమినుల్ హక్ 91 పరుగులతో రాణించాడు. లిటన్ దాస్ 33, తస్కిన్ అహ్మద్ 28 పరుగులు చేశారు.
ఐదు వికెట్లు తీసిన మహ్మద్ అబ్బాస్
పాకిస్తాన్ బౌలింగ్‌లో మహ్మద్ అబ్బాస్ విజృంభించాడు. అతను 34 ఓవర్లలో 92 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. షాహీన్ షా అఫ్రిది 31.1 ఓవర్లలో 113 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, హసన్ అలీ మరియు నోమన్ అలీ చెరో వికెట్ సాధించారు. సల్మాన్ ఆగా 6 ఓవర్లు బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ దక్కలేదు.
