అనవసర ఖర్చులు లేవు, విలాసాలు లేవు.. అయినా రూ. 90 వేల జీతం వచ్చే వ్యక్తి రూ. 15 లక్షల అప్పుల్లో ఎలా కూరుకుపోయాడు?

మధ్యతరగతి కుటుంబాల్లో బడ్జెట్ నిర్వహణ ఒక సవాలుతో కూడుకున్న పని. కానీ, ఎటువంటి తప్పులు చేయకపోయినా, నిర్లక్ష్యంగా ఉండకపోయినా ఒక సామాన్య వ్యక్తి అప్పుల ఊబిలో ఎలా కూరుకుపోతాడో మీకు తెలుసా? ఆర్థిక సలహాదారు (Financial Advisor) వివేక్ లింక్డ్‌ఇన్‌లో పంచుకున్న ఒక ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పుణెకు చెందిన 36 ఏళ్ల ఆపరేషన్స్ మేనేజర్, నెలకు రూ. 90,000 సంపాదిస్తున్నా, ప్రస్తుతం రూ. 15 లక్షల అప్పుల్లో ఉన్నాడు.

మూడేళ్ల క్రితం వరకు అతని జీవితం సాఫీగా సాగిపోయింది. నెలకు రూ. 90,000 జీతంలో, రూ. 82,000 ఇంటి అవసరాలకు, పిల్లల ఫీజులకు ఖర్చయ్యేవి. నెలకు రూ. 8,000 ఆదా అయ్యేది. అంతా బాగుండగా, అనుకోకుండా అతని తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ఎమర్జెన్సీ సర్జరీ కోసం రూ. 5 లక్షల ఖర్చయింది. చేతిలో అంత నగదు లేక, 14% వడ్డీతో రూ. 5 లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నాడు. దీనివల్ల నెలకు రూ. 13,663 EMI భారం పడింది. అక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది.

ఆ EMI వల్ల అతని నెలవారీ ఖర్చు రూ. 96,000కు చేరింది, కానీ జీతం రూ. 90,000 మాత్రమే. ఆ రూ. 6,000 లోటును పూడ్చుకోవడానికి క్రెడిట్ కార్డు వాడటం మొదలుపెట్టాడు. ఏడాదిలో క్రెడిట్ కార్డు బిల్లు రూ. 4 లక్షలకు చేరింది, దీనిపై 40% వడ్డీ పడసాగింది. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో, 18% వడ్డీతో మరో రూ. 6 లక్షల లోన్ తీసుకున్నాడు, దీనివల్ల నెలకు మరో రూ. 17,625 EMI భారం పెరిగింది.

ప్రస్తుతం అతను నెలకు తన జీతంలో 57% (రూ. 51,000) కేవలం అప్పులు తీర్చడానికే ఖర్చు చేస్తున్నాడు. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు తీసుకునే పరిస్థితికి చేరుకున్నాడు. మీ నెలవారీ EMIలు మీ జీతంలో 40% దాటితే, అది ప్రమాద సంకేతమని వివేక్ హెచ్చరిస్తున్నారు. ఈ ఊబి నుంచి బయటపడాలంటే కొత్త అప్పులు తీసుకోవడం మానేసి, కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా ‘ఎమర్జెన్సీ ఫండ్’ను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.


Posted

in

by

Tags: