ప్రేమ, కుటుంబ బంధాలలో తలెత్తే అనుమానం, కోపం చాలా సందర్భాల్లో విచక్షణ కోల్పోయేలా చేసి మనుషులను కరుడుగట్టిన నేరస్థులుగా మార్చేస్తున్నాయి.
చిన్నపాటి వాగ్వాదాలను కూడా మాట్లాడుకుని పరిష్కరించుకోకుండా ఆవేశంతో చేయి చేసుకునే ధోరణి, ఇద్దరి భవిష్యత్తుతో పాటు కుటుంబాల ప్రశాంతతను ఒక్క క్షణంలో చిదిమేస్తోంది.
మహారాష్ట్రలోని పూణే హింజేవాడి ప్రాంతంలో, విప్రో సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల కోమల్ రాజేంద్ర దహాకే.. తన ప్రియుడు, ఇన్ఫోసిస్ ఉద్యోగి శుభమ్ ధ్యానేశ్వర్ కల్బండే చేతిలో దాడికి గురై ప్రాణాలు కోల్పోయింది. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించిన నేపథ్యంలో, పక్కపక్కనే ఉన్న పీజీ హాస్టళ్లలో నివసిస్తున్న వీరిద్దరి మధ్య అనుమానం కారణంగా తరచూ గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది.
ఆదివారం రాత్రి రెస్టారెంట్‌కు వెళ్లి కోమల్ గదికి తిరిగి వచ్చిన తర్వాత, అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గొడవ ముదరడంతో ఆగ్రహానికి లోనైన శుభమ్, కోమల్‌పై తీవ్రంగా దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. అనంతరం రాత్రంతా మృతదేహం పక్కనే కూర్చున్న శుభమ్, ఉదయం 6.30 గంటలకు పోలీసులకు ఫోన్ చేసి అంబులెన్స్ కోరగా.. విచారణలో అసలు నిజం బయటపడటంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఉన్నత చదువులు చదివి, ప్రముఖ ఐటీ సంస్థల్లో భారీ వేతనాలు అందుకుంటున్న యువతలో సైతం కోపాన్ని నియంత్రించుకోలేని మనస్తత్వం, అసహనం పెరుగుతుండటాన్ని ఈ ఘటన కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. క్షణికావేశం ఒక యువతి ప్రాణాలను బలిగొనడమే కాకుండా, మరొకరి జీవితాన్ని కటకటాల పాలు చేయడం తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave a Reply