“అనేక రాష్ట్రాలు నష్టాల్లో ఉన్నా ఉచితాల పంపిణీ ఎందుకు?”; ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం, కోర్టులో ఏం జరిగింది?

రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలపై (Freebies) సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాల వల్ల అనేక రాష్ట్ర ప్రభుత్వాలపై అప్పుల భారం పెరుగుతోందని, ఆదాయం తగ్గిపోతోందని సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

అప్పులు పెరుగుతున్నప్పటికీ ఉచితాలను ఎందుకు పంచుతున్నారని కోర్టు ప్రశ్నించింది. వీటికంటే ఉపాధి కల్పనపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

తమిళనాడుకు చెందిన విద్యుత్ సంస్థకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. “మేము ఇప్పటికే టారిఫ్ ధరలను నిర్ణయించాము” అని విద్యుత్ సంస్థ వాదించగా, “మేము విద్యుత్తును ఉచితం చేశాము” అని ప్రభుత్వం పేర్కొంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేస్తూ.. “ప్రభుత్వం ఉచితంగా డబ్బు, విద్యుత్ లేదా ఇతర సౌకర్యాలు ఇస్తూ పోతే, ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? అంతిమంగా ఈ భారం పన్ను చెల్లింపుదారులపైనే పడుతుంది. ప్రభుత్వం ఉచితాలు ఇవ్వడం కంటే ఉపాధి కల్పనపై శ్రద్ధ చూపాలి” అని అన్నారు.

కోర్టు చేసిన మరికొన్ని వ్యాఖ్యలు:

  • ఇలా ఉచితాలు ఇస్తూ పోతే దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది.
  • పేదలకు, విద్య లేదా కనీస అవసరాలు తీరని వారికి సాయం చేయడం ప్రభుత్వ బాధ్యత. కానీ, ఇప్పటికే ఆర్థికంగా బాగున్న వారి జేబుల్లోకి కూడా ఈ ఉచితాలు వెళ్తున్నాయి. ఇది సరైనదేనా?
  • మీరు ఎంత పెద్ద భూస్వామి అయినప్పటికీ, ఉచిత విద్యుత్ పొందుతున్న రాష్ట్రాలు మాకు తెలుసు. ఏదైనా సదుపాయం కావాలంటే దానికి చెల్లించాలి. ఇది పన్ను చెల్లింపుదారుల సొమ్ము అని ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారు.
  • ఇది కేవలం తమిళనాడు గురించే కాదు, ఎన్నికలకు ముందే ఇలాంటి ప్రకటనలు ఎందుకు వస్తున్నాయి? రాజకీయ పార్టీలు, మేధావులు దీనిపై ఆలోచించాలి. రాష్ట్రం నష్టాల్లో ఉన్నా ఉచితాలు ఇవ్వడం ఎప్పటి వరకు కొనసాగుతుంది? మీరు వసూలు చేసే ఆదాయంలో కనీసం 25 శాతాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు ఉపయోగించకూడదు? అని ధర్మాసనం ప్రశ్నించింది.

Posted

in

by

Tags: