చెన్నై: ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడి పెరుగుతోంది. ఇందులో భాగంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రం అధికార డీఎంకే కూటమి మరియు ప్రతిపక్ష ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మధ్య రసవత్తరంగా మారింది. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా ఈసారి గట్టిగానే శబ్దం చేస్తోంది. అయితే, ఈ ఎన్నికల బరిలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పేరు కె. అన్నామలై.
ఏఐఏడీఎంకేతో పొత్తు కారణంగా ఇప్పటికే అసంతృప్తితో ఉన్న తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలైకి బీజేపీ హైకమాండ్ మరో షాక్ ఇచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న అన్నామలైకి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించలేదు. తద్వారా రాష్ట్రంలోని ఒక కీలక నేతను ఎన్నికల బరి నుంచి తప్పించినట్లయింది.
మాజీ గవర్నర్, కేంద్ర మంత్రులకు ఛాన్స్ ఏఐఏడీఎంకేతో పొత్తులో భాగంగా బీజేపీకి కేవలం 27 స్థానాలు మాత్రమే దక్కాయి. అందులో పార్టీ తన సీనియర్ నేతలను బరిలోకి దింపింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మైలాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. అలాగే, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ అవినాశి నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. ఒక ప్రముఖ దళిత నాయకుడికి అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం కల్పించడం ద్వారా పార్టీ కీలక వ్యూహం రచించినట్లు కనిపిస్తోంది.
మహిళా నేతలకు ప్రాధాన్యత బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ కోయంబత్తూర్ నార్త్ నుండి మళ్ళీ పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆమె అదే నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరితో పాటు కీర్తికా శివకుమార్ (మొడకురిచ్చి), కవితా శ్రీకాంత్ (అరంతంగి) వంటి మహిళా అభ్యర్థులకు టికెట్లు దక్కాయి.
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా (ముఖ్యమైనవి):
- మైలాపూర్ – తమిళిసై సౌందరరాజన్
- అవినాశి – ఎల్. మురుగన్
- కోయంబత్తూర్ నార్త్ – వనతి శ్రీనివాసన్
- నాగర్‌కోయిల్ – ఎం.ఆర్. గాంధీ
- మదురై సౌత్ – రామ శ్రీనివాసన్
మొత్తంగా చూస్తే, ఈ జాబితాలో మహిళా అభ్యర్థులకు బీజేపీ పెద్దపీట వేసింది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. తొలి జాబితా విడుదల కావడంతో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది.
