అపరిపక్వ ప్రేమ తెచ్చిన ముప్పు.. 10 వారాల గర్భం మోసిన బాలిక.. తల్లిదండ్రుల తప్పిదంతో ప్రాణాలు బలి!

చెంగల్పట్టు: తమిళనాడులోని చెంగల్పట్టు ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక స్థానిక పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. ఇటీవల ఆమెకు అకస్మాత్తుగా జ్వరం రావడంతో, తల్లిదండ్రులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆ బాలిక 10 వారాల గర్భవతి అని నిర్ధారించారు.

దీంతో దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు ఆమెను నిలదీయగా.. పొరుగున ఉండే ఒక యువకుడితో పరిచయం వల్ల గర్భం దాల్చినట్లు, ఆ వివరాలేవీ తనకు తెలియవని బాలిక బదులిచ్చింది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భయపడిన తల్లిదండ్రులు, ఇంట్లోనే ఆమెకు గర్భస్రావం (Abortion) చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ప్రక్రియలో బాలికకు రక్తస్రావం ఎక్కువై స్పృహ కోల్పోయింది.

వెంటనే ఆమెను చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ఆమెను చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు కోల్పోయింది.

పోలీసులకు సమాచారం ఇవ్వడంలో జాప్యం: జనవరి 4నే బాలిక గర్భం దాల్చిన విషయం తల్లిదండ్రులకు తెలిసినప్పటికీ, ప్రైవేట్ ఆసుపత్రి గానీ, చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రి గానీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదనే ఆరోపణలు వస్తున్నాయి. రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చేరిన తర్వాతే పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడైన యువకుడిని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. 15 రోజులుగా మృత్యువుతో పోరాడిన బాలిక చివరకు కన్నుమూయడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.


Posted

in

by

Tags: