మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో తగినంత వర్షాలు కురవకపోవడంతో సోయాబీన్ సహా పలు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వర్షాధారంగా సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో రేణాపూర్ ప్రాంతానికి చెందిన బాలాజీ కదమ్ అనే రైతు.. అప్పు చేసి సాగు చేసిన తన మూడెకరాల సోయాబీన్ పంట పూర్తిగా దెబ్బతినడంతో, చేసేదేమీ లేక దానిపై ట్రాక్టర్ నడిపి దున్నేశారు. ఈ ఘటన అక్కడి రైతుల దయనీయ స్థితికి అద్దం పడుతోంది.
వర్షాకాలం ప్రారంభంలో కురిసిన కొద్దిపాటి వర్షాన్ని నమ్ముకుని బాలాజీ కదమ్ తన పొలంలో సోయాబీన్ సాగు చేశారు. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. దీంతో పంట ఎదుగుదల ఆగిపోయి, మొక్కలు పసుపు రంగులోకి మారి ఎండిపోయాయి. వేసిన పంటను కాపాడుకోవడానికి తగినంత నీరు కూడా లేకపోవడంతో ఆయన ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు. ఆ ప్రాంతంలోని బోరుబావులు, బావులు, నదులు తదితర నీటి వనరుల్లోనూ నీటిమట్టం పడిపోయిందని ఆయన తెలిపారు.
మూడెకరాల్లో సాగు చేసిన సోయాబీన్ పంట మొత్తం నాశనమైందని తెలిపిన బాలాజీ కదమ్.. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు కోసం వడ్డీకి అప్పు తెచ్చినట్లు చెప్పారు. మంచి దిగుబడి వస్తుందన్న ఆశతో పెట్టిన పెట్టుబడి మొత్తం ఇప్పుడు నష్టంగా మారింది. దీంతో ఎండిపోయిన పంటను ట్రాక్టర్‌తో దున్నేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కాగా, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని, రాబోయే రబీ సీజన్ సాగుకు అవసరమైన సాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
లాతూర్ జిల్లాలోని 171 చిన్న, పెద్ద జలాశయాల్లో ప్రస్తుతం కేవలం 12 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నట్లు జలవనరుల శాఖ నివేదిక వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి ఈ జలాశయాల్లో సుమారు 90 శాతం నీరు ఉండేది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ పంటల దిగుబడి భారీగా తగ్గే ప్రమాదం ఏర్పడింది. నీటి వసతి ఉన్న కొందరు రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుండగా, ఆ సౌకర్యం లేని రైతులు మాత్రం కళ్లముందే పంటలు ఎండిపోతుంటే ఏమీ చేయలేక తల్లడిల్లిపోతున్నారు.

Leave a Reply