అబ్బో..! సైకిల్‌పై లస్సీ అమ్మి రెండంతస్తుల భవనం కట్టాడు.. నెలకు రూ.90,000 సంపాదన.. ఐటీ ఉద్యోగం కంటే ఇదే బెటర్ లా ఉందిగా.. కానీ ఆయన చెప్పిన మాట వింటే కళ్లు చెమర్చుతాయి!

ఢిల్లీ వీధుల్లో సైకిల్‌పై లస్సీ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న ఒక వ్యక్తి జీవన పోరాట గాథ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం ఆయన భుజాలపై పడింది. కేవలం 11 ఏళ్ల పిన్న వయసులోనే పనిలోకి దిగిన ఆయన, కుటుంబ అవసరాల కోసం తీవ్రంగా శ్రమించాడు. బడికి వెళ్లి ఆడుకోవాల్సిన వయసులోనే బతుకు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రారంభంలో రోజుకు కేవలం ₹250 మాత్రమే సంపాదించేవాడినని ఆయన తెలిపారు. సంపాదన తక్కువగా ఉన్నప్పటికీ ఏ పనీ చిన్నది కాదనుకుని నిరంతరం కష్టపడ్డారు. కాలక్రమేణా ఆయన ఆదాయం క్రమంగా పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో లస్సీ అమ్ముతూ నెలకు దాదాపు ₹80,000 నుండి ₹90,000 వరకు సంపాదిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఆదాయం పెరిగినప్పటికీ కుటుంబ బాధ్యతలను ఆయన ఏనాడూ విస్మరించలేదు. తోబుట్టువుల పెళ్లిళ్లు జరిపించడంతో పాటు కుటుంబానికి అవసరమైనవన్నీ సమకూర్చారు. ఎన్నో ఏళ్లుగా ఆయనకున్న ఏకైక పెద్ద కల.. సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవడమే. ఏళ్ల తరబడి రూపాయి రూపాయి పొదుపు చేసి, ఉత్తరప్రదేశ్‌లోని తన స్వగ్రామంలో అందమైన రెండంతస్తుల ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ఇల్లు ఆయనకు కేవలం భవనం మాత్రమే కాదు, ఎన్నో ఏళ్ల కష్టానికి, విజయానికి ప్రతీకగా నిలిచింది.

“దేవుడిని ఏదైనా ఒక కోరిక కోరుకునే అవకాశం వస్తే ఏం అడుగుతారు?” అని ప్రశ్నించినప్పుడు.. “నా తండ్రి నాకు మళ్లీ కావాలి” అని ఆయన చెప్పిన సమాధానం అందరి హృదయాలను కదిలించింది. ఎంత డబ్బు, సౌకర్యాలు వచ్చినా తండ్రి లోటును ఏదీ భర్తీ చేయలేదన్న ఆయన మాటలు నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. ఎంతటి కష్టాలు వచ్చినా కష్టపడే తత్వాన్ని వదులుకోకూడదనే స్పూర్తిని ఆయన జీవితం అందిస్తోంది. చిన్న పనైనా నిజాయితీగా కష్టపడితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చనడానికి ఆయన ప్రయాణమే నిదర్శనం.


Posted

in

by

Tags: