బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారనేది అందరికీ తెలిసిందే. అయితే, ఒకానొక సందర్భంలో ఆయన కోసం ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని ఒక రోజు నిలిపివేశారంటే నమ్మశక్యంగా లేదు కదా! కానీ, ఇది నిజం. ఆసక్తికరమైన ఆ విశేషాలు ఇవే:
ఆ యుద్ధం ఎందుకు ఆగిందంటే? 90వ దశకంలో అమితాబ్ బచ్చన్, శ్రీదేవి నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఖుదా గవా’. ముకుల్ ఎస్. ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ మరియు మజార్-ఎ-షరీఫ్ ప్రాంతాల్లో జరిగింది. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో అంతర్యుద్ధం (ముజాహిదీన్ల పోరాటం) జరుగుతోంది. షూటింగ్ కోసం అమితాబ్ బచ్చన్ అక్కడికి వెళ్లినప్పుడు, ఆయన భద్రత కోసం అప్పటి ఆఫ్ఘన్ అధ్యక్షుడు నజీబుల్లా ఒక రోజు పాటు యుద్ధాన్ని నిలిపివేయాలని ఆదేశించారు.
అధ్యక్షుడి కూతురే కారణం! భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ మాజీ రాయబారి షైదా మహ్మద్ అబ్దాలీ బీబీసీతో మాట్లాడుతూ, అప్పటి అధ్యక్షుడు నజీబుల్లా కుమార్తె అమితాబ్‌కు పెద్ద అభిమాని అని తెలిపారు. తన తండ్రిని కోరి, అమితాబ్ కాబూల్‌లో సురక్షితంగా తిరగడానికి, ప్రజలు ఆయనను చూసే అవకాశం కల్పించడానికి ఆమె ఒక రోజు యుద్ధ విరామం కోరింది. ఆ అభ్యర్థన మేరకు యుద్ధాన్ని నిలిపివేశారు. ముజాహిదీన్లు కూడా అమితాబ్‌కు అభిమానులు కావడంతో, వారు కూడా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు.
వ్యతిరేక వర్గాలకూ ఇష్టమైన అమితాబ్: ఆ సమయంలో మరో కీలక నాయకుడు బుర్హానుద్దీన్ రబ్బానీ కూడా అమితాబ్‌కు పెద్ద అభిమాని. ఆయన అమితాబ్‌కు పూలగుచ్చం పంపి, షూటింగ్ బృందానికి పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ట్యాంకులు, హెలికాప్టర్ల రక్షణ: షూటింగ్ సమయంలో అమితాబ్ మరియు చిత్ర బృందానికి అసాధారణమైన భద్రత కల్పించారు. వారు ఎక్కడికి వెళ్లినా.. ముందు ఐదు ట్యాంకులు, వెనుక ఐదు ట్యాంకుల కాన్వాయ్ వెంట ఉండేది. అంతేకాకుండా, గన్‌షిప్ హెలికాప్టర్ల రక్షణలో వారిని షూటింగ్ స్పాట్‌లకు తీసుకెళ్లేవారు.
ఇంట్లోనే ఆతిథ్యం: 2013లో అమితాబ్ స్వయంగా తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఈ జ్ఞాపకాలను పంచుకున్నారు. అప్పట్లో అక్కడ హోటళ్లలో ఉండటం ప్రమాదకరం కావడంతో, ఒక స్థానిక కుటుంబం తమ ఇంటిని షూటింగ్ బృందానికి ఇచ్చి, వారు చిన్న గదిలోకి మారిపోయారని ఆయన గుర్తుచేసుకున్నారు. దాదాపు రూ. 5.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఖుదా గవా’ ఆ కాలంలో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
