అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల్లో ఉద్యోగం సాధించాలనేది చాలామంది యువత కల. అయితే అలాంటి కంపెనీల్లో ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేయాలి? ఎంపిక విధానం ఎలా ఉంటుంది? ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి.
అమెజాన్‌లో మీరు ఎంచుకునే ఉద్యోగాన్ని బట్టి ఎంపిక విధానం మారుతుంటుంది. ఇందులో ఆన్‌లైన్ దరఖాస్తు, ఆన్‌లైన్ అసెస్‌మెంట్ (సామర్థ్య పరీక్ష), ఫోన్ ఇంటర్వ్యూ, ముఖాముఖి ఇంటర్వ్యూ వంటి వివిధ దశలు ఉంటాయి.
ముందుగా అమెజాన్ అధికారిక కెరీర్ (Jobs) వెబ్‌సైట్‌లో మీ విద్యార్హతలు, అనుభవం, నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలను వెతకాలి. మీకు నచ్చిన ఉద్యోగాన్ని ఎంచుకున్న తర్వాత, దానికి కావాల్సిన అర్హతలు, ఇతర నిబంధనలను క్షుణ్ణంగా చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో నింపే వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన తర్వాత ఆన్‌లైన్ సామర్థ్య పరీక్షకు (Online Assessment) హాజరు కావాల్సి ఉంటుంది.
ఈ పరీక్షా విధానం మీరు దరఖాస్తు చేసే ఉద్యోగాన్ని బట్టి మారుతుంది. కొన్ని ఉద్యోగాలకు అభ్యర్థుల నైపుణ్యాలను పరిశీలించేందుకు ఫోన్ ద్వారా కూడా ఇంటర్వ్యూ నిర్వహించవచ్చు. ఇందులో అభ్యర్థి అనుభవం, నైపుణ్యాలు, ఆ ఉద్యోగానికి అవసరమైన పరిజ్ఞానంపై ప్రశ్నలు అడుగుతారు. అయితే ఈ దశ అన్ని ఉద్యోగాలకూ తప్పనిసరి కాదు. ముఖ్యంగా టెక్నికల్ మరియు ప్రొఫెషనల్ ఉద్యోగాలకు మాత్రం పలు రౌండ్లలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు.. సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? గత ఉద్యోగాల్లో ఎలా పనిచేశారు? వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. అయితే, అన్ని ఉద్యోగాలకూ ఇంటర్వ్యూలు ఉండవు. గంటల ప్రాతిపదికన (Hourly basis) చేసే కొన్ని ఉద్యోగాలకు అసలు ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి, దరఖాస్తు చేసే ముందే ఆయా ఉద్యోగాల ఎంపిక విధానాన్ని తెలుసుకుని, దానికి తగినట్లుగా సిద్ధం కావడం ఎంతో అవసరం.

Leave a Reply