సక్సెస్ స్టోరీ: బెంగళూరుకు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి, ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటైన అమెజాన్‌లో ఉద్యోగం సాధించిన శైలేంద్ర యాదవ్ కథ నేడు లక్షలాది మంది యువతకు స్ఫూర్తినిస్తోంది.
ఇది కేవలం ఒక ఉద్యోగం సాధించిన కథ మాత్రమే కాదు.. ఒక తండ్రి పడిన కష్టం, త్యాగం మరియు తన కొడుకు కలలపై ఆయన పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనం. శైలేంద్ర తన కుటుంబంలోనే ఇంజనీరింగ్ పూర్తి చేసిన మొదటి వ్యక్తి. ఇప్పుడు ఆయన ‘సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్’గా అమెజాన్‌లో చేరారు.
కొంతకాలం క్రితం, శైలేంద్ర తన తండ్రికి అమెజాన్ ఆఫర్ లెటర్‌ను చూపిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కొడుకు సాధించిన ఘనతను చూసి తండ్రి కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి. దశాబ్దాల కష్టం, పోరాటం ఒకే క్షణంలో సార్థకమైన ఆ దృశ్యం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ తండ్రీకొడుకుల కథకు లక్షలాది మంది నెటిజన్లు ఫిదా అయ్యారు.
ఈ భావోద్వేగపూరితమైన వీడియో అమెజాన్ దృష్టిని కూడా ఆకర్షించింది. శైలేంద్ర విజయం వెనుక ఉన్న తండ్రి కష్టాన్ని గుర్తించిన కంపెనీ, వారికి ఒక ప్రత్యేకమైన ‘సర్ ప్రైజ్ గిఫ్ట్ హ్యాంపర్’ను పంపింది.
ఆ ప్యాకేజీని తండ్రి ఓపెన్ చేస్తున్నప్పుడు ఆయన ముఖంలో కనిపించిన ఆనందం వర్ణనాతీతం. ఆ హ్యాంపర్‌లో ఒక టీ-షర్ట్, ‘Dad’ అని రాసి ఉన్న క్యాప్, ఒక మగ్, పెన్ను, చాక్లెట్లు మరియు ఒక చిన్న మొక్క ఉన్నాయి. వీటితో పాటు, తండ్రి నమ్మకమే ఈ విజయానికి పునాదని పేర్కొంటూ కంపెనీ ఒక భావోద్వేగపూరితమైన లేఖను కూడా పంపింది.
ఈ ప్రత్యేక క్షణాన్ని పంచుకుంటూ, “ఒకప్పుడు నాన్న ఆఫర్ లెటర్‌ను చేతిలో పట్టుకుని ఆనందంతో ఏడ్చారు. అప్పుడే అర్థమైంది, ఈ కల కేవలం నాది మాత్రమే కాదు, మా నాన్నది కూడా అని. ప్రతి కష్టకాలంలో, ప్రతి త్యాగంలో, నాన్న చేసిన మౌన ప్రార్థనల్లో ఆయన నా వెంటే ఉన్నారు” అని శైలేంద్ర రాసుకొచ్చారు.
శైలేంద్ర ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగలేదు. రైతు కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ వెంటాడేవి. కొడుకుకు మంచి విద్య అందించడానికి తండ్రి వ్యవసాయంతో పాటు చిన్న చిన్న పనులు కూడా చేశారు. వనరులు తక్కువగా ఉన్నప్పటికీ, కొడుకు కలలను ఏనాడూ ఆపలేదు.
నేడు శైలేంద్ర సాధించిన విజయం కేవలం ఆయన వ్యక్తిగత ఘనత మాత్రమే కాదు.. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొనే ప్రతి తల్లిదండ్రులకు అంకితం. కుటుంబం అండ, కష్టపడే తత్వం తోడైతే ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ఈ కథ నిరూపిస్తోంది.
