అమెరికా ఉలిక్కిపడేలా పాకిస్థాన్ రహస్య వ్యూహం! ఇరాన్ యుద్ధం మధ్యలో సరికొత్త క్షిపణి తయారీ?

మధ్యప్రాచ్యంలో యుద్ధం ముదురుతున్న వేళ, అమెరికా దృష్టి అంతా ఇరాన్‌పైనే ఉంది. అయితే, ఇదే సమయంలో మన పొరుగు దేశం పాకిస్థాన్ చేస్తున్న ఒక పని అమెరికా నిఘా వర్గాల దృష్టిని ఆకర్షించింది. నేరుగా అమెరికా వరకు వెళ్లగల సామర్థ్యం ఉన్న క్షిపణిని పాకిస్థాన్ అభివృద్ధి చేస్తోందని తెలుస్తోంది.

పాకిస్థాన్ క్షిపణి సామర్థ్యం: ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన క్షిపణి ‘షాహీన్ 3’ (Shaheen-III). ఇది 2,750 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇది భారతదేశంలోని ఏ ప్రాంతాన్నైనా, చివరకు అండమాన్ నికోబార్ దీవులను కూడా తాకగలదు. అయితే, ఇది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM) కాదు. ఒక క్షిపణిని ICBM అనాలంటే అది కనీసం 5,500 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలగాలి.

అమెరికా గురిగా కొత్త ప్లాన్: పాకిస్థాన్ నుండి అమెరికాకు ఉన్న దూరం 11,000 కి.మీ కంటే ఎక్కువ. ఈ దూరాన్ని చేరుకోగల క్షిపణిని పాకిస్థాన్ తయారు చేస్తోందని అమెరికా గుర్తించింది. రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ సరసన ఇప్పుడు పాకిస్థాన్‌ను కూడా అమెరికాను చేరుకోగల క్షిపణులు తయారు చేస్తున్న దేశంగా అమెరికా జాబితా చేసింది. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ (Tulsi Gabbard) సెనేట్ సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ క్షిపణి పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి పదేళ్ల సమయం పట్టవచ్చని అంచనా.

పాకిస్థాన్ భయం ఏంటి?: సాధారణంగా పాకిస్థాన్ తన క్షిపణులు కేవలం భారత్‌ను ఉద్దేశించినవే అని చెబుతుంటుంది. కానీ 11,000 కి.మీ ప్రయాణించే క్షిపణి భారత్ కోసం కాదని స్పష్టమవుతోంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం.. భవిష్యత్తులో అమెరికా ఎప్పుడైనా తమ అణు కేంద్రాలపై దాడులు చేస్తే, అమెరికాను కూడా తాము దెబ్బతీయగలమని నిరూపించడానికే (Deterrence) పాకిస్థాన్ ఈ అడుగు వేస్తోంది. ముఖ్యంగా 2025లో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత పాకిస్థాన్ తన రాకెట్ దళాన్ని మరింత బలోపేతం చేసుకుంది.


Posted

in

by

Tags: