ఇరాన్‌పై భూతల యుద్ధానికి (Ground War) సిద్ధమవుతున్న అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా విమర్శించింది.
అమెరికా పదాతి దళాల రాక కోసం తమ సైన్యం వేచి చూస్తోందని, వారిని దహించి వేయడానికి ఇరాన్ వెనకాడదని పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గాలిబాఫ్ అన్నారు. “అమెరికా బహిరంగంగా చర్చల సందేశాలను పంపుతోంది, కానీ రహస్యంగా భూతల దాడికి ప్లాన్ చేస్తోంది” అని ఆయన ఆరోపించారు. డొనాల్డ్ ట్రంప్ చర్చలకు సిద్ధమని చెబుతూనే, తెరవెనుక దాడులకు వ్యూహాలు రచిస్తున్నారని ఆయన విమర్శించారు.
పెంటగాన్ వ్యూహాలు: ఇరాన్‌లో వారాల పాటు సాగే భూతల యుద్ధం కోసం పెంటగాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అమెరికా మీడియా నివేదించింది. దీనిని ధృవీకరిస్తూ, 3,500 మంది సైనికులతో కూడిన ’31వ మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్’ ఇప్పటికే మిడిల్ ఈస్ట్‌కు చేరుకున్నట్లు అమెరికా సైన్యం ధృవీకరించింది. వీరు అత్యాధునిక ‘యూఎస్ఎస్ ట్రిపోలి’ యుద్ధనౌక ద్వారా ఈ ప్రాంతానికి చేరుకున్నారు.
ముఖ్యమైన లక్ష్యాలు: అమెరికా ప్రధానంగా ఇరాన్ ఆర్థిక మరియు సైనిక వెన్నెముకను దెబ్బతీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో 90% జరిగే ఖార్గ్ ద్వీపాన్ని (Kharg Island) స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇరాన్ ఆర్థిక వనరులను తుడిచిపెట్టాలని అమెరికా భావిస్తోంది. అలాగే, ప్రపంచ చమురు వ్యాపారంలో మూడింట ఒక వంతు సాగే హోర్ముజ్ జలసంధిపై పట్టు సాధించడం అమెరికాకు పెద్ద సవాలుగా మారింది.
