పోర్ట్ ఆర్థర్ (టెక్సాస్): అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న ప్రముఖ చమురు శుద్ధి కర్మాగారం ‘వలేరో రిఫైనరీ’లో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. సోమవారం రాత్రి పోర్ట్ ఆర్థర్‌లోని ప్లాంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. కిలోమీటర్ల దూరం వరకు ప్ర కంపనలు సృష్టించిన ఈ పేలుడు తర్వాత ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. ప్లాంట్‌లోని ఇండస్ట్రియల్ హీటర్‌లో సాంకేతిక లోపం తలెత్తడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
అప్రమత్తమైన యంత్రాంగం: పేలుడు ధాటికి నగరంలోని పశ్చిమ ప్రాంత ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. విషపూరితమైన పొగను పీల్చకుండా ఉండేందుకు కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని జెఫర్సన్ కౌంటీ షెరీఫ్ సెనా స్టీఫెన్స్ సూచించారు. ప్రస్తుతానికి ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. ఈ ప్లాంట్‌కు రోజుకు 4.35 లక్షల బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఉంది.
భీతిని గొలిపిన శబ్దం: సోమవారం సాయంత్రం సంభవించిన ఈ పేలుడు శబ్దానికి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్లు కూడా కంపించాయి. వాహనాల అద్దాలు సైతం విరకపోయాయని ప్రత్యక్ష సాక్షులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. రిఫైనరీ నుండి భారీ అగ్నిగోళాలు ఆకాశంలోకి ఎగసిపడటం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. టెక్సాస్‌లో తెలుగు వారు మరియు మలయాళీలు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో అక్కడ ఉన్న ప్రవాస భారతీయులు ఆందోళన చెందుతున్నారు.
చమురు ధరలపై ప్రభావం: ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి మూతపడి ఉన్న తరుణంలో, అమెరికాలోని ఈ భారీ రిఫైనరీలో ప్రమాదం జరగడం అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చమురు ధరలు గత నెలతో పోలిస్తే 33 శాతం పెరిగాయి.
ఆర్థిక మాంద్యం ముప్పు? చమురు ధరలు బ్యారెల్‌కు 138 డాలర్ల కంటే ఎక్కువగా వరుసగా మూడు నెలల పాటు కొనసాగితే, అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఆర్థిక మాంద్యంలోకి (Recession) వెళ్లే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే 12 నెలల్లో మాంద్యం వచ్చే అవకాశం ఇప్పుడు 32 శాతానికి పెరిగిందని వారు అంచనా వేస్తున్నారు.
