న్యూయార్క్: అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ, అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక USS అబ్రహం లింకన్ (CVN-72) మరియు దాని దళం మధ్యప్రాచ్యానికి చేరుకుంది. ప్రస్తుతం ఈ నౌకాదళం ఇరాన్‌కు అతి సమీపంలోకి వెళ్తోంది.
మలక్కా జలసంధి మీదుగా అరేబియా సముద్రం వైపు వెళ్తున్న ఈ యుద్ధనౌక సమీపంలోనే ఇరాన్ సరుకు రవాణా నౌక ‘అర్విన్’ ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే USS అబ్రహం లింకన్ సముద్రంలో ‘కన్నమూచి’ ఆడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అందుకు కారణం, ఆ అమెరికా యుద్ధనౌక తన ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS) సిగ్నల్‌ను నిలిపివేయడమే. సాధారణంగా ప్రమాదకర ప్రాంతాల్లో శత్రువుల నిఘా నుండి తప్పించుకోవడానికి సైన్యం ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. అయితే ఇరాన్‌కు దగ్గరవుతున్న సమయంలో ట్రాకింగ్ సిస్టమ్ ఆపేయడం చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌పై అమెరికా ఎప్పుడైనా దాడి చేయవచ్చనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
అణుశక్తితో పనిచేసే సూపర్ క్యారియర్
అణుశక్తితో నడిచే ఈ భారీ యుద్ధనౌక ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో విన్యాసాలు పూర్తి చేసుకుని మధ్యప్రాచ్యానికి బయలుదేరింది. ఇండో-పసిఫిక్ ప్రాంతం నుండి వచ్చిన ఈ నౌక ఇరాన్ సరిహద్దులకు చేరుకోవడానికి మరో 2-3 రోజులు మాత్రమే పడుతుంది.
ఈ నౌకలో అత్యాధునిక F/A-18E/F సూపర్ హార్నెట్, E/A-18G గ్రోలర్ వంటి యుద్ధ విమానాలతో కూడిన ‘ఎయిర్ వింగ్ 9’ విభాగం ఉంది. దీనితో పాటు గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌకలు, అణుశక్తితో నడిచే సబ్మెరైన్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు చెందిన మరికొన్ని యుద్ధనౌకలు మోహరించి ఉన్నాయి.
ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యమా?
న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఇరాన్ ప్రభుత్వం తన ప్రజలపై చేస్తున్న అణిచివేతను నిరసిస్తూ అమెరికా గట్టి చర్యలకు సిద్ధమవుతోంది. పెంటగాన్ అధికారులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పలు ప్రతిపాదనలు (Options) అందించారు. ఇందులో ఇరాన్‌లోని అణు కేంద్రాలు మరియు బాలిస్టిక్ క్షిపణి స్థావరాలపై దాడులు చేసే అవకాశం కూడా ఉంది.
ముఖ్యంగా ఫోర్డో, నటాంజ్ మరియు ఇస్ఫాహాన్ వంటి అణు విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవచ్చని తెలుస్తోంది. గత జూన్ 22న జరిగిన B2 బాంబర్ విమానాల దాడి కంటే ఇది మరింత తీవ్రంగా ఉండవచ్చని అంచనా.
ట్రంప్ తుది నిర్ణయం ఎప్పుడు?
మరోవైపు, ఇరాన్ అంతర్గత భద్రతా దళాలైన ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)’ మరియు నిరసనకారులను అణిచివేస్తున్న ‘బసిజ్ మిలీషియా’ దళాలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు లేదా పరిమిత సైనిక దాడులు చేసే ఆలోచనలో కూడా అమెరికా ఉంది. యుద్ధం రాకుండా కేవలం హెచ్చరిక పంపడమే దీని ఉద్దేశమని ఒక అధికారి తెలిపారు.
ఇరాన్లో నిరసనలు మూడవ వారానికి చేరడం, ఉద్రిక్తతలు పెరగడంతో అమెరికా తమ పౌరులను ఇరాన్ వదిలి రావాలని ఆదేశించింది. “మేము ఇరాన్ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా గమనిస్తున్నాం. మా సైన్యం అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. త్వరలోనే ఒక బలమైన నిర్ణయం తీసుకుంటాం,” అని ట్రంప్ తన మార్-ఎ-లాగో నివాసం నుండి వాషింగ్టన్ వెళ్తుండగా విలేకరులతో చెప్పారు.
