ఢిల్లీకి చెందిన వినయ్ గుప్తా (31) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, అడోబ్ (Adobe) కంపెనీలో ఏడాదికి ₹60 లక్షల భారీ ప్యాకేజీతో పనిచేస్తున్నాడు.
ఆయనకు, భార్య రేఖకు మధ్య 4 నెలల కవల పిల్లలకు మందు వేసే విషయంలో హఠాత్తుగా చిన్న వాగ్వాదం మొదలైంది.
ఈ గొడవతో తీవ్ర ఆగ్రహానికి గురైన రేఖ, ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి తన పుట్టింటి వారికి సమాచారం అందించింది. కాసేపటికే రేఖ తండ్రి, సోదరులు, వదినలతో కూడిన కుటుంబ సభ్యులు కారులో వినయ్ ఇంటికి చేరుకున్నారు.
ఇంట్లోకి చొరబడిన అత్తమామల కుటుంబం వినయ్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది. వినయ్ తల్లి వారిని ఆపేందుకు ప్రాధేయపడినా కనికరించకుండా.. వినయ్ గొంతు నులిమి, ఛాతీపై బలంగా తన్నుతూ తీవ్రంగా గాయపరిచారు.
రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వినయ్‌ను స్థానికులు కాపాడి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ దాడి జరగడానికి ముందే రేఖ ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను ఆపేసి, పక్కా ప్రణాళికతోనే ఈ ఘోరానికి పాల్పడిందని వినయ్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వినయ్ భార్య రేఖతో పాటు ఆమె ఇద్దరు సోదరులు, వదిన సహా మొత్తం నలుగురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. పసిపిల్లకు మందు వేసే విషయంలో మొదలైన చిన్న వివాదం ప్రాణం తీసే స్థాయికి చేరడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave a Reply