ఏడాదికి రూ. 20 లక్షల భారీ ప్యాకేజీతో చేతినిండా సంపాదిస్తున్నప్పటికీ, ప్రస్తుతం చేతిలో ఒక్క రూపాయి కూడా పొదుపు (సేవింగ్స్) లేక తల్లడిల్లుతున్న 30 ఏళ్ల ఐటీ (IT) ఉద్యోగి ఒకరు.. తన భవిష్యత్తు కోసం డబ్బును ఎలా పొదుపు చేయాలో తెలియక ఇంటర్నెట్ వేదికగా సహాయం కోరిన హృదయ విదారక కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పేద కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన అతనే ఆ ఇంటికి ఏకైక ఆధారంగా (Sole breadwinner) ఉన్నాడు. ఇటీవల తన తల్లిదండ్రుల కోసం తమ సొంత ఇంటిని ఆధునీకరించే (ರಿನోవేషన్) క్రమంలో.. తాను రూపాయి రూపాయి కూడబెట్టుకున్న దాదాపు రూ. 14 లక్షల నగదును పూర్తిగా ఖర్చు చేసేశాడు.
అప్పుల్లేవు.. కానీ చేతిలో సున్నా పొదుపు:
ఎలాంటి అప్పులు చేయకూడదనే గట్టి నిర్ణయంతో, తన జీవితకాల పొదుపునంతా ఆ ఇంటి కోసమే ఖర్చు చేయడంతో.. ప్రస్తుతం 30 ఏళ్ల వయస్సులో అతని బ్యాంక్ ఖాతాలో పొదుపు మొత్తం సున్నాకు (Zero) పడిపోయింది.
ప్రస్తుతానికి తనపై ఎలాంటి అప్పులు గానీ లేదా ఈఎమ్ఐ (EMI) ల భారం గానీ లేనప్పటికీ.. ప్రస్తుత అస్థిరమైన జాబ్ మార్కెట్లో కేవలం ఉద్యోగాన్ని మాత్రమే నమ్ముకుని ఉండలేమని అతను ఆందోళన చెందుతున్నాడు. తనకంటూ ఎలాంటి ఇన్సూరెన్స్, పాలసీలు కూడా లేవని.. ఇకపై మళ్లీ సున్నా నుండి తన ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్మించుకోవాలో అర్థం కావడం లేదంటూ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘రెడిట్’ (Reddit) వేదికగా అతను తన ఆవేదనను వెళ్లగక్కాడు.
నెటిజన్ల ప్రశంసలు – విలువైన సలహాలు:
కుటుంబం కోసం ఎలాంటి స్వార్థం లేకుండా కష్టపడి, తన సర్వస్వాన్ని తల్లిదండ్రుల సంతోషం కోసం ధారపోసిన ఆ యువకుడి బాధ్యతను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతనిని ఎంతగానో అభినందిస్తూ.. మళ్లీ కొత్తగా డబ్బును ఎలా పొదుపు చేయాలి? ఎలా పెట్టుబడులు (ఇన్వెస్ట్మెంట్స్) పెట్టాలి? అనే విషయాలపై పలువురు నెటిజన్లు అతనికి విలువైన ఆర్థిక సలహాలు, సూచనలు ఇస్తూ ధైర్యం చెబుతున్నారు.
