పేదరికం అనే సంకెళ్లను తెంచే అతిపెద్ద ఆయుధం విద్య. తమ పొట్ట కట్టుకుని తల్లిదండ్రులు పిల్లలను చదివించేది కేవలం వారి భవిష్యత్తు బాగుండాలనే ఏకైక ఆశతోనే. పిల్లలు తమ కన్నవారి కలలను నిజం చేసినప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిది.
అలాంటి ఒక అద్భుత క్షణానికి సాక్ష్యంగా నిలిచిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తోంది. లక్షలాది మంది కళ్లను చెమర్చేలా చేస్తోంది.
అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేసిన విద్యార్థిని!
వైరల్ అవుతున్న ఈ వీడియోలో సాక్షి అనే విద్యార్థిని తన 10వ తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత పక్కనే ఉన్నవారి ఫోన్ నుండి తన తల్లికి కాల్ చేస్తుంది. ‘అమ్మా… నేను పాస్ అయ్యాను’ అని చెప్పగానే ఆమె గొంతు మూగబోతుంది. ఆనందభాష్పాలు ఆమె బుగ్గలపై రాలుతుంటాయి. కేవలం ‘నేను పాస్ అయ్యాను’ అనే నాలుగు పదాల వెనుక ఆమె ఏళ్ల తరబడి పడ్డ శ్రమ, పేదరికంతో చేసిన పోరాటం మరియు ఆమె తల్లి కల దాగి ఉన్నాయని ఆ కన్నీళ్లే స్పష్టంగా చెబుతున్నాయి.
దేవదూతలా వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ తన్ సింగ్!
సాక్షి సాధించిన ఈ విజయం వెనుక ఒక గొప్ప వ్యక్తి కృషి ఉంది. ఆయనే ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తన్ సింగ్. ఆయన కేవలం ఖాకీ దుస్తులు ధరించి చట్టాన్ని కాపాడటమే కాకుండా, సరైన విద్యా సౌకర్యాలు లేని పేద పిల్లల కోసం ‘తన్ సింగ్ కీ పాఠశాల’ పేరుతో ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. సాక్షి కూడా ఇదే పాఠశాల విద్యార్థిని.
ఈ వీడియోలో మొదట తన్ సింగ్ గారే సాక్షి తల్లికి ఫోన్ చేసి, ‘మీ అమ్మాయి పాస్ అయ్యింది’ అని శుభవార్త చెబుతారు. ఆ తర్వాత ఫోన్ను సాక్షికి ఇవ్వగా, ఆమె తన తల్లి గొంతు వినగానే వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆ సంభాషణ ముగిసిన తర్వాత సాక్షి పరుగెత్తుకుంటూ వెళ్లి తన గురువు తన్ సింగ్ను గట్టిగా హత్తుకుంటుంది. ఈ దృశ్యం ఎంతటి కఠిన హృదయాన్నైనా కరిగించేలా ఉంది.
వీడియోపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు:
తన్ సింగ్ ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటూ, ‘మా పాఠశాల విద్యార్థిని సాక్షి 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించింది’ అని గర్వంగా రాశారు. ఈ వీడియోకు వేలల్లో లైక్లు, కామెంట్లు వస్తున్నాయి. ‘పోలీస్ అంటే కేవలం లాఠీ పట్టేవాళ్లే కాదు, సమాజాన్ని సంస్కరించే గురువులు కూడా’ అని నెటిజన్లు తన్ సింగ్ను కొనిాడుతున్నారు. సాక్షి సాధించిన విజయానికి దేశవ్యాప్తంగా అభినందనలు అందుతున్నాయి.
ఈ వీడియో మనకు నేర్పే పాఠం ఒక్కటే – సహాయం చేసే మనసు, సాధించాలనే పట్టుదల ఉంటే పేదరికం ఎప్పుడూ అడ్డంకి కాదు. సాక్షి విజయం ఆమె కుటుంబంలో కొత్త ఆశలను నింపింది.
