“అయ్యా.. 500 రూపాయల కూలి, అది కూడా మండుతున్న ఇసుకలో..!” బీఏ (BA) చదివినా ఎడారిలో కూలి పని.. డిప్యూటీ సీఎంకు మొరపెట్టుకున్న బీహార్ యువకుడి కన్నీటి వీడియో..!!

బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రకాష్ కుమార్ అనే పట్టభద్రుడైన యువకుడు, రాజస్థాన్‌లోని మండుతున్న ఇసుకలో రోజుకు 500 రూపాయల కూలికి పనిచేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

హిస్టరీ, పొలిటికల్ సైన్స్‌లో బీఏ (BA) డిగ్రీని ఫస్ట్ క్లాస్‌లో పాసైనప్పటికీ, తన సొంత రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో 2,500 కిలోమీటర్ల దూరం వచ్చి కూలి పని చేసుకుంటున్నానని ఆ యువకుడు వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు.

‘దేశ చరిత్రను, ప్రభుత్వ వ్యవస్థను చదువుకున్న నేను, నేడు బతుకుదెరువు కోసం ఎడారి ఇసుకలో కష్టపడుతున్నాను. 500 రూపాయల కూలి పని చేయడానికి నేను బాధపడటం లేదు, కానీ ఆ పనిని నా సొంత రాష్ట్రంలో చేసుకోలేకపోతున్నానన్నదే నా ప్రధాన ఆవేదన’ అని అతడు వాపోయాడు.

బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి విజ్ఞప్తి చేస్తూ.. ‘బీహార్‌లో పారిశ్రామికవాడలు ఏర్పాటు చేసి యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా ఆపాలి. తమిళనాడు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా బీహార్‌లోనే నాకు నెలకు 15,000 రూపాయల జీతంతో ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం ఇప్పించినా చాలు’ అని ఎంతో భావోద్వేగంగా వేడుకున్నాడు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం బీహార్ నుండి సుమారు 60 లక్షలకు పైగా కార్మికులు పని వెతుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన నేపథ్యంలో, ఈ గ్రాడ్యుయేట్ యువకుడి కన్నీటి వీడియో ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.


Posted

in

by

Tags: