అటవీ ప్రాంతాల గుండా వెళ్లే రైల్వే ట్రాక్‌లను దాటే క్రమంలో మూగజీవాలు రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోవడం నిత్యకృత్యంగా మారింది.
ముఖ్యంగా, ఏనుగుల గుంపులు ట్రాక్ దాటుతున్నప్పుడు జరిగే ఘోర ప్రమాదాలు వన్యప్రాణి ప్రేమికులను, ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే, ట్రాక్ దాటుతున్న ఏనుగుల గుంపును వేగంగా దూసుకొస్తున్న రైలు ప్రమాదం నుంచి కాపాడేందుకు ఓ వ్యక్తి చూపించిన సమయస్ఫూర్తి, తెగువ ప్రస్తుతం నెటిజన్ల మనసులను గెలుచుకుంది.
రైల్వే ట్రాక్ దాటేందుకు ఏనుగుల గుంపు ఒకటి వస్తున్న సమయంలోనే, అదే ట్రాక్‌పై ఓ రైలు అత్యంత వేగంగా దూసుకొచ్చింది. దీన్ని గమనించిన ఆ వ్యక్తి, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పరుగున వెళ్లి రైలు లోకో పైలట్ (డ్రైవర్)కు ప్రమాద హెచ్చరిక సంకేతాలు ఇచ్చాడు.
పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశాడు. దీంతో కొద్ది అడుగుల దూరంలోనే రైలు ఆగిపోవడంతో, ఏనుగుల గుంపు ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా ట్రాక్‌ను దాటి వెళ్లిపోయింది.
ఆ వ్యక్తి చూపిన అసాధారణ సమయస్ఫూర్తి, సాహసం వల్ల మూగజీవాలకు జరగాల్సిన పెను ముప్పు తప్పింది. ఈ ఉత్కంఠభరిత దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డై సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
వేలాది మంది నెటిజన్లు, ప్రముఖులు ఆ వ్యక్తి సమయస్ఫూర్తిని, మూగజీవాల పట్ల అతను చూపిన అపారమైన కరుణను కొనియాడుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మానవత్వం, వన్యప్రాణుల సంరక్షణ కలగలిసిన ఈ అద్భుత సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
