అయ్యో.. ఇదేం విచిత్రం! ఫోన్ పోయినా పర్లేదు, రీల్సే ముఖ్యం.. మెట్రోలో షాకింగ్ ఘటన: యాజమాన్యం కఠిన హెచ్చరికలు!

ఢిల్లీ మెట్రో రైళ్ల కిటికీలకు మొబైల్ ఫోన్లను అతికించి రీల్స్ తీసే సంస్కృతి పెరిగిపోవడంతో, సోషల్ మీడియా క్రియేటర్లకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

కదిలే రైలు వెలుపలి భాగంలో ఫోన్‌ను ఉంచి తీసే ఇలాంటి ప్రమాదకరమైన వీడియోల వల్ల ప్రయాణికులతో పాటు క్రియేటర్లకు కూడా గాయాలయ్యే ప్రమాదం ఉందని, అంతేకాకుండా మొబైల్ ఫోన్లు కిందపడి పాడైపోయే అవకాశం ఉందని హెచ్చరించింది.

నిఖిల్ కొచ్చర్, నందిని శుక్లా అనే సోషల్ మీడియా వినియోగదారులు తీసిన రీల్స్ వైరల్ కావడంతో మెట్రో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిఖిల్ కొచ్చర్ చేసిన వీడియోకు 138 మిలియన్లకు పైగా వ్యూస్ రావడంతో, అతనిని చూసి చాలామంది ఇలాంటి వీడియోలు తీయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం ప్రజారవాణాను ఇలా ప్రమాదకర రీతిలో ఉపయోగించడంపై మెట్రో యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేసింది.

మెట్రో ప్రాంగణంలో గానీ, కదిలే రైళ్లలో గానీ తోటి ప్రయాణికుల భద్రతకు భంగం కలిగించేలా ఇలాంటి వీడియోలు తీయకూడదని, హెచ్చరికలను బేఖాతరు చేసేవారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని DMRC స్పష్టం చేసింది. ప్రజా రవాణా సాధనాల్లో ప్రయాణించేటప్పుడు తోటి ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు సూచించారు.


Posted

in

by

Tags: