ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఓ మహిళ తన ఇంట్లోనే ప్రసవించడంతో, స్థానికులు ఆమెను ఒక పడక దుప్పటిలో (బెడ్షీట్) మోసుకుంటూ సమీపంలోని మున్సిపల్ ప్రసూతి ఆసుపత్రికి తరలించారు.
అత్యవసర సహాయం కోసం ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించగా.. వారు వెంటనే స్పందించలేదని, సహాయం చేయడానికి నిరాకరించారని స్థానికులు ఆరోపించారు.
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించి, సకాలంలో సహాయం అందించకపోయినప్పటికీ.. తల్లి, నవజాత శిశువు ఇద్దరూ ప్రస్తుతం క్షేమంగా, సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం, ఆగ్రహావేశాలకు దారితీసింది.
ఈ ఘటనపై బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. అత్యవసర సమయంలో ఆసుపత్రి స్పందించిన తీరు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర నివేదిక సమర్పించాలని కోరారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు.
