ముంబై కొలాబాలోని ప్రముఖ మెక్‌డొనాల్డ్స్ (McDonald’s) అవుట్లెట్కు చెందిన ఆహార భద్రత మరియు వాణిజ్య లైసెన్స్‌ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) తక్షణమే అమల్లోకి వచ్చేలా సస్పెండ్ చేసింది.
మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం కమిషనర్ తుకారాం ముండే నేతృత్వంలోని అధికారుల బృందం చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో తీవ్రమైన పారిశుధ్య లోపాలు, కీటకాల సమస్య బయటపడటంతో ఈ కఠిన చర్య తీసుకున్నారు.
అధికారులు జరిపిన తనిఖీల్లో.. కిచెన్ ప్రాంతంలో బతికున్న బొద్దింకలు తిరుగుతుండటం, కుళ్లిపోయిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం, సరైన రిఫ్రిజిరేషన్ సదుపాయాలు లేకపోవడం, ఆహారం తయారుచేసే ప్రదేశంపై దుమ్ము పట్టిన లైట్లు రక్షణ లేకుండా ఉండటం వంటి అనేక నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారు. అంతేకాకుండా, సిబ్బంది మురికిగా ఉన్న బూట్లు, వస్త్రాలను తాకిన తర్వాత చేతులు కడుక్కోకుండానే ఆహారాన్ని తాకడం, చీజ్ (Cheese) విషయంలో తప్పుదారి పట్టించే లేబుళ్లను ఉపయోగించినట్లు కూడా వెలుగులోకి వచ్చింది.
గతంలో ఎఫ్‌డీఏ (FDA) ఎత్తిచూపిన 20 ప్రధాన లోపాల్లో 18 లోపాలను సరిదిద్దకుండా ఈ రెస్టారెంట్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. లోపాలన్నీ సరిచేశామని రెస్టారెంట్ నిర్వాహకులు 148 పేజీల వివరణ నివేదిక ఇచ్చినప్పటికీ, ప్రత్యక్ష తనిఖీల్లో పరిస్థితి ఏమాత్రం మారలేదని రుజువైంది. దీంతో ఈ బ్రాంచ్‌ను తాత్కాలికంగా మూసివేయించి, ఆహార విక్రయాలు మరియు డెలివరీలపై పూర్తిగా నిషేధం విధించారు.

Leave a Reply