మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని (Ujjain) రైల్వే స్టేషన్లో, ఒక తల్లి తన ఇద్దరు పసిపిల్లలను వదిలేసి వెళ్లిన ఘటన మానవత్వాన్ని కలచివేస్తూ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 సమీపంలోని ప్రయాణికుల వెయిటింగ్ హాల్లో, 6 నుంచి 7 నెలల పసికందును, ఏడాదిన్నర వయసున్న పాపను ఒక బల్లపై పడుకోబెట్టి ఆ మహిళ అకస్మాత్తుగా మాయమైంది.
ఎంతసేపటికీ తల్లి రాకపోవడాన్ని గమనించి అనుమానం వచ్చిన అక్కడి ప్రజలు, వెంటనే జీఆర్పీ (GRP) పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సునీల్ గుప్తా, మహిళా పోలీసులు ఆ పిల్లలను సురక్షితంగా రక్షించి, వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వైద్య పరీక్షల అనంతరం, రాత్రికి రాత్రే ఆ ఇద్దరు పిల్లలను ‘మాతృఛాయ’ అనే అనాథాశ్రమ డైరెక్టర్ మనీష్ బైరాగి సంరక్షణకు అప్పగించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు పసిపిల్లలు ఆ సంస్థ సంరక్షణలో సురక్షితంగా ఉన్నారు.
ఈ క్రమంలో పిల్లలను వదిలేసి వెళ్లిన తల్లి ఎవరనేది కనిపెట్టేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. రైల్వే స్టేషన్, పార్శిల్ గోడౌన్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను ఆర్పీఎఫ్ (RPF) సహాయంతో పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఆ మహిళ ఏ సమయంలో పిల్లలను వదిలిపెట్టింది, ఆమె ఏ ఊరికి చెందినది అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. తల్లి దొరికిన తర్వాత పిల్లలను వారికి అప్పగించడానికి లేదా తదుపరి తగిన చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి.

Leave a Reply