ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజియాబాద్‌లో పోలీసుల నిర్లక్ష్యం కారణంగా 22 ఏళ్ల యువకుడు జాలిగా ప్రాణాలు విడిచిన షాకింగ్ సంఘటన వెలుగుచూసింది.
మెకానిక్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్ అనే యువకుడు, ఒక ఆటో డ్రైవర్‌తో అద్దె విషయంలో జరిగిన గొడవ కారణంగా అక్కడ ఉన్న మహిళా పోలీస్ అవుట్‌పోస్టుకు (సహాయ కేంద్రానికి) వచ్చాడు. అక్కడ మహిళా పోలీసులు మాత్రమే విధుల్లో ఉండటంతో, ఈ సమస్యపై సమీపంలోని పురుషుల పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని వారు అతనికి సూచించినట్లు తెలుస్తోంది.
దీంతో ఆగ్రహానికి గురైన రాజ్‌కుమార్, మద్యం మత్తులో పోలీస్ అవుట్‌పోస్ట్ ఇనుప గేటును బలంగా బాదాడు. దీంతో భయపడిపోయిన అక్కడి మహిళా పోలీసులు తమను తాము రక్షించుకోవడానికి అవుట్‌పోస్ట్ లోపలికి వెళ్లి తలుపులు లాక్ చేసుకున్నారు.
ఆ తర్వాత రాజ్‌కుమార్ అక్కడే ఉన్న గ్లాస్ డోర్‌ను (అద్దాల తలుపును) గట్టిగా కొట్టడంతో అది పగిలి, అతని చేతికి లోతైన గాయమై తీవ్రంగా రక్తస్రావం అయింది. గాయపడిన అతను సహాయం కోసం దాదాపు 40 నిమిషాల పాటు అరిచి నెత్తీనోరు బాదుకున్నప్పటికీ, లోపల ఉన్న మహిళా పోలీసులు తలుపులు తీయడానికి గానీ, అతనికి సహాయం చేయడానికి గానీ ముందుకు రాలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు.
దీనిని గమనించిన అక్కడి ఒక దుకాణదారుడు పోలీస్ అత్యవసర సహాయక నంబర్ 112కు సమాచారం అందించాడు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రోడ్డుపై వెళ్తున్న ఆటోలను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ ఏ ఆటో కూడా ఆగలేదు.
చివరికి దాదాపు 25 నుండి 30 నిమిషాల తర్వాత వచ్చిన అంబులెన్స్ ద్వారా అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ, అంతకంటే ముందే విపరీతంగా రక్తస్రావం కావడంతో అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ సంఘటన పోలీసుల అత్యవసర రక్షణ వ్యవస్థ యొక్క నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేయడమే కాకుండా, ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చింది.
