మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘాట్ జిల్లా సీతాడోంగ్రి గ్రామంలో జరిగిన తీవ్ర విషాద సంఘటన స్థానిక ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
48 ఏళ్ల శాంతిబాయి ఉయికే, ఇంటి అవసరాల కోసం బావిలో నీళ్లు తోడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి లోపల పడిపోయింది. ఇది చూసిన ఆమె భర్త అంజోర్ సింగ్ ఉయికే (52), భార్యను కాపాడాలనే ఉద్దేశంతో వెంటనే బావిలోకి దూకాడు. అయితే, దురదృష్టవశాత్తూ ఇద్దరూ నీటిలో మునిగిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు.
సంఘటన గురించి సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. గ్రామస్థుల సాయంతో భార్యాభర్తలిద్దరి మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు. రాత్రి సమయం కావడంతో మరుసటి రోజు పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించినట్లు, అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
ఈ దంపతులకు ఐదుగురు కుమారులు ఉన్నారు. ఒకే రోజు తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. తల్లిదండ్రుల వియోగాన్ని తట్టుకోలేక తలడిల్లుతున్న ఆ ఐదుగురు కుమారులను గ్రామస్థులు ఓదారుస్తున్నారు. భార్యను కాపాడేందుకు ప్రయత్నించిన భర్త కూడా ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన కుటుంబ సభ్యులనే కాకుండా గ్రామాన్నంతటినీ తీవ్ర విషాదంలో నింపింది.

Leave a Reply