మహారాష్ట్రలోని నాగ్‌పూర్, శాంతినగర్ ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల మహిళ, గత జులై 27న షిరిడీ వెళ్లేందుకు తన ఇంటి అల్మారా తెరిచి నగల కోసం వెతికింది.
అయితే అల్మారాలో దాచి ఉంచిన బంగారు నగలన్నీ కనిపించకపోవడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
కుటుంబ సభ్యులను ఆరా తీసినా నగల గురించి ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో, ఆ మహిళకు తన కోడలు కిరాంతలి ఆకాశ్ వర్మపై అనుమానం వచ్చింది. దీంతో కోడలిని గట్టిగా నిలదీయగా, ఆమె నగలు దొంగిలించినట్లు అంగీకరించిందని సమాచారం.
అల్మారాలో ఉన్న 30 గ్రాముల బంగారు తాళి చైను, 13 గ్రాముల బంగారు నెక్లెస్, మరో 10 గ్రాముల ఇతర బంగారు ఆభరణాలు.. మొత్తంగా 53 గ్రాముల నగలను దొంగిలించి అమ్మిన కోడలు, ఆ డబ్బుతో తన కోసం ఒక లగ్జరీ ‘ఐఫోన్’ కొన్నట్లు తెలిసింది. అపహరణకు గురైన నగల మొత్తం విలువ సుమారు రూ. 2.50 లక్షలు ఉంటుందని చెబుతున్నారు.
తాను దొంగిలించిన నగలను తిరిగి అత్తకు ఇచ్చేందుకు కోడలు నిరాకరించడంతో, బాధితురాలు శాంతినగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply