మధ్యప్రదేశ్ రాష్ట్రం మందసౌర్ (Mandsaur) ప్రాంతంలో చాక్లెట్ గొడవ కారణంగా 12 ఏళ్ల బాలిక చేసిన అఘాయిత్యానికి 4 ఏళ్ల పసికందు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
కొద్ది రోజుల క్రితం చిన్నారికి ఇచ్చిన చాక్లెట్‌ను పక్కింట్లో ఉండే బాలిక లాక్కోవడంతో, చిన్నారి తల్లి ఆ బాలికను గట్టిగా మందలించి తిట్టింది.
దీంతో కోపం, కక్ష పెంచుకున్న ఆ బాలిక.. గత 24వ తేదీన చిన్నారికి చాక్లెట్ ఇస్తానని ఆశచూపి తన ఇంటికి తీసుకెళ్లింది.
ఆ తర్వాత అక్కడున్న తాగునీటి ట్యాంకులో చిన్నారిని కిరాతకంగా తోసేసి, బయటకు రాకుండా దానిపై ఓ పెద్ద రాయి పెట్టి మూసేసినట్లు పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సదరు బాలికను అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కు (బాలల సంస్కరణ శాలకు) తరలించారు. ఈ ఘటనపై మరింత ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
