ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ హృదయ విదారక ఘటన ఒడిశా రాష్ట్రం బలంగీర్ జిల్లాలోని కాంతాబంజి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో చోటుచేసుకుంది.
దినసరి కూలీగా పనిచేసే ఓ తండ్రి, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన చిన్నారి కుమారుడిని చికిత్స నిమిత్తం ఈ ఆసుపత్రికి తీసుకొచ్చాడు.
వైద్యులు పరీక్షించి ఆ బాలుడు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం పోస్ట్‌మార్టం నిర్వహించాల్సి ఉంటుందని కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే పోస్ట్‌మార్టం చేయించడానికి ఇష్టపడని ఆ తండ్రి, పుట్టెడు దుఃఖంతో తన కన్నబిడ్డ మృతదేహాన్ని భుజంపై వేసుకుని కన్నీరుమున్నీరవుతూ ఆసుపత్రి నుంచి బయటకు నడిచాడు. ఈ దృశ్యాలు అక్కడ వీడియో రికార్డయ్యాయి.
అనంతరం ఆసుపత్రి యాజమాన్యం, పోలీసులు ఆ తండ్రిని శాంతింపజేసి, చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ అంబులెన్స్ (అమర వాహనం) ద్వారా మృతదేహాన్ని వారి స్వగ్రామానికి పంపించినట్లు అధికారులు స్పష్టం చేశారు. పూర్తి సమాచారం తెలియకుండా కేవలం కొంత భాగాన్ని మాత్రమే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.

Leave a Reply