దార్జిలింగ్ సమీపంలో హనీమూన్‌కు వెళ్లిన ఓ నవ వధువు.. రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన బార్బిక్యూ విందు సమయంలో అనుకోకుండా మంటల్లో చిక్కుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది.
పశ్చిమ బెంగాల్‌లోని కలింపాంగ్ జిల్లాలో ఉన్న సిడోంగ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సుమారు రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్న సమీర్ దాస్, నిఖితా దాస్ దంపతులు సెలవులు గడపడానికి ఈ కొండ ప్రాంతానికి వెళ్లారు. సరదాగా సమయం గడుపుతున్న సమయంలో.. రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన బార్బిక్యూ స్టవ్ సమీపంలో ఇద్దరూ కూర్చున్నారు.
అదే సమయంలో.. స్టవ్‌కు అవతలి వైపు ఉన్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఓ డబ్బాలో ఉన్న ద్రవాన్ని మండుతున్న మంటపై పోశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడి.. పక్కనే కూర్చున్న నిఖిత వైపు దూసుకెళ్లాయి. క్షణాల్లోనే ఆమె మంటల్లో చిక్కుకుంది.
అనుకోని పరిణామంతో షాక్‌కు గురైన నిఖిత కేకలు వేస్తూ నేలపై పడిపోయారు. వెంటనే ఆమె భర్త, రిసార్ట్ సిబ్బంది అక్కడికి పరుగెత్తుకొచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
ద్రవాన్ని మంటపై పోసిన వ్యక్తి కూడా తన షర్ట్‌ను విప్పి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అనంతరం తీవ్రంగా గాయపడిన నిఖితను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ షాకింగ్ ఘటన మొత్తం రిసార్ట్‌లోని CCTV కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రమాదం నేపథ్యంలో.. పర్యాటక ప్రాంతాలు, ప్రైవేట్ రిసార్ట్‌లలో బార్బిక్యూ వంటి బహిరంగ మంటలతో కూడిన కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన అగ్నిమాపక భద్రతా చర్యలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
చిన్న నిర్లక్ష్యం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Leave a Reply