అయ్యో పాపం! కొడుకు పెళ్లి రోజే ఇలా జరగాలా? పెళ్లింటి పక్కనే శవమై కనిపించిన తండ్రి! ఈ ఘోరానికి పాల్పడింది సొంత అల్లుడేనా?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురలో కొడుకు పెళ్లి వేడుకే విషాదంగా ముగిసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

అలీగఢ్ ప్రాంతానికి చెందిన ఓంప్రకాష్ (62), తన కుమారుడు అరవింద్ వివాహానికి హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. గోవర్ధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధోలి గ్రామంలో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఆ సమయంలో పెళ్లింటికి సమీపంలోని ఖాళీ స్థలంలో ఓంప్రకాష్ మెడపై గాయాలతో శవమై కనిపించారు.

పెళ్లికి వచ్చిన వారు ఆయన కోసం వెతకడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పెళ్లింట నెలకొన్న ఆనందం కాస్తా ఒక్కసారిగా విషాదంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పదునైన ఆయుధంతో దాడి చేసి ఆయనను హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.

ఈ హత్యకు సంబంధించి ఓంప్రకాష్ చిన్నల్లుడు సుఖ్‌వీర్‌పై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. సుఖ్‌వీర్‌కు, అతని భార్య రేఖకు మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయని, దీంతో రేఖ గత ఆరు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోందని తెలుస్తోంది. అంతేకాకుండా, బావమరిది పెళ్లికి తనను పిలవలేదన్న కోపంతో ఉన్న సుఖ్‌వీర్, పెళ్లి రోజున ఇంట్లో రక్తం ఏరులై పారుతుందని గతంలోనే బెదిరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సుఖ్‌వీర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా, కుటుంబంలో ఇంతటి విషాదం నెలకొన్నప్పటికీ, వరుడు అరవింద్, వధువుల వివాహ తంతు కన్నీళ్ల మధ్యే కొనసాగింది. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *