అయ్యో పాపం..! నవ్వడమే నేరమా..? సెలూన్ షాప్ బయట స్నేహితులు నవ్వుకున్నారని చెలరేగిన గొడవ.. పట్టపగలే గుంపుగా వచ్చి చితకబాదిన వైనం..!

మహారాష్ట్రలోని గోండియా జిల్లా తిరోడా ప్రాంతంలో కేవలం నవ్వారన్న కారణంతో కొందరు యువకులపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

తిరోడా నగరంలోని ఒక సెలూన్ షాప్ సమీపంలో కొందరు యువకులు నిల్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు, “మమ్మల్ని చూసి ఎందుకు నవ్వుతున్నారు?” అంటూ వాగ్వాదానికి దిగారు. ఆ మాటామాటా కాస్తా తీవ్ర ఘర్షణగా మారింది.

25 ఏళ్ల లోకేష్ మదన్‌లాల్ ప్రజాపతి తన స్నేహితులతో కలిసి సెలూన్ వద్ద నిల్చుని ఉండగా ఈ వివాదం మొదలైంది. అక్కడికి వచ్చిన వ్యక్తులు వారితో గొడవపడి, ఆపై లోకేష్ మరియు అతని స్నేహితులపై కర్రలతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో తల, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు.

ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సెలూన్ షాప్‌లోని సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు బయటకు వచ్చి స్థానికంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ దాడిలో కార్తీక్ గజానన్ రహాంగ్‌డేల్, తేజస్ భరత్‌లాల్ ఉర్కుడే అనే ఇద్దరు యువకులు గాయపడినట్లు తెలిసింది. రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలే ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

ఈ ఘటనపై తిరోడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితులైన రుద్ర రాకేష్ వాల్మీక్, గౌరవ్ దిలీప్ కరోసిలతో పాటు ఒక మైనర్ బాలుడిని.. మొత్తం ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags: