ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహరాన్పూర్ జిల్లాకు చెందిన దుష్యంత్ కుమార్ (32) భారత సైన్యంలో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. తన బంధువు దేవ్‌కరణ్ వివాహానికి హాజరయ్యేందుకు గత నవంబర్ 5వ తేదీన సెలవుపై స్వగ్రామానికి వచ్చారు.
పనియాలి ఖాసింపూర్ గ్రామంలోని ఒక వివాహ మండపంలో మొన్న రాత్రి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో వరుడి ఊరేగింపు (బారాత్) జరుగుతుండగా, దుష్యంత్ కుమార్ తన భార్యతో కలిసి డీజే సంగీతానికి అనుగుణంగా ఉత్సాహంగా నృత్యం చేస్తున్నారు.
ఆ సమయంలో అకస్మాత్తుగా ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో సొమ్మసిల్లి కింద పడిపోయారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, బంధువులు ఆయనను వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ దుష్యంత్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు.
ఆయనను పరీక్షించిన వైద్యులు గుండెపోటు కారణంగానే మరణించారని నిర్ధారించారు. కాసేపటి క్రితం వరకు ఆటపాటలతో సందడిగా ఉన్న పెళ్లి ఇల్లు, దుష్యంత్ మరణవార్తతో క్షణాల్లో విషాదంలో మునిగిపోయింది.
మృతి చెందిన దుష్యంత్ కుమార్ తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. ఆయనకు వివాహమై ఐదేళ్లు అవుతున్నా పిల్లలు లేరు. కుటుంబానికి ఏకైక ఆధారమైన కుమారుడు కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో తట్టుకోలేక తల్లిదండ్రులు, భార్య గుండెలవిసేలా రోదించడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.
ఈ ఘటనపై దుష్యంత్ బాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, నాగల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాధేశ్యామ్ యాదవ్ నేతృత్వంలోని పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply