అయ్యో.. ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న వృద్ధుడిని కాపాడబోతే నేరమైపోయిందా..? “ప్రథమ చికిత్స చేసినందుకు వచ్చిన తిప్పలు”.. రూ. 2.68 లక్షల నష్టపరిహారం చెల్లించిన యువతి.. ఈ రోజుల్లో మంచి చేయాలన్నా భయపడాలా?

చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో, అనారోగ్యంతో స్పృహతప్పి పడిపోయిన వృద్ధుడిని కాపాడటానికి ప్రయత్నించిన ఓ మహిళకు ఎదురైన అనుభవం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

జియావో ఐహువా అనే మహిళ మహ్జాంగ్ గేమ్ సెంటర్‌ను నడుపుతోంది. అక్కడికి తరచూ వచ్చే 60 ఏళ్ల వృద్ధుడు ఒకరు ఆగస్టు 17న అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. అది చూసిన జియావో వెంటనే అతనికి సాయం చేయడానికి పరుగెత్తుకుంటూ వెళ్లింది. ఎండ తీవ్రత లేదా వేడి దెబ్బ తగలడం వల్ల అలా అయి ఉండవచ్చని భావించి, అతడిని గాలి ఆడే ప్రదేశానికి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది.

వృద్ధుడి పరిస్థితి విషమంగా మారడంతో జియావో తీవ్ర కంగారు, భయాందోళనల వల్ల వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేయలేకపోయింది. కాసేపటికి పక్కనే ఉన్న మరొకరు అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గంలో ఆయన బతికే ఉన్నప్పటికీ, ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించాడు. అనంతరం ఆ వృద్ధుడి కుటుంబ సభ్యులు అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, జియావో సరైన పద్ధతిలో ప్రథమ చికిత్స చేయలేదని, ఆమె వల్లే ఆయన మరణించాడని ఆరోపించారు. ప్రాణం కాపాడబోయిన సదరు మహిళకే ఊహించని సమస్య ఎదురైంది.

ఆ తర్వాత వృద్ధుడి కుటుంబ సభ్యులు జియావోను భారీ పరిహారం డిమాండ్ చేశారు. దాదాపు రూ.14 లక్షలకు పైగా పరిహారంగా ఇవ్వాలని, లేకపోతే మృతదేహాన్ని ఆమె షాపు ముందే ఉంచి ధర్నా చేస్తామని బెదిరించారు. ఈ పరిణామంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన జియావో, ఆమె భర్త చివరకు 19,000 యువాన్లు (భారత కరెన్సీలో రూ.2.68 లక్షలకు పైగా) చెల్లించారు. డబ్బులు ఇచ్చినప్పటికీ ఈ ఘటన జియావోను మానసికంగా తీవ్రంగా కుంగదీసింది, ఆ ఒత్తిడి కారణంగా ఆమె ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు అసలు విషయాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించిన వారినే ఇలా వేధించి డబ్బులు వసూలు చేస్తే, భవిష్యత్తులో ఆపదలో ఉన్నవారికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రారని పలువురు మండిపడ్డారు. దీనిపై స్పందించిన పోలీసులు, స్థానిక అధికారులు ఈ కేసును మళ్లీ దర్యాప్తు చేశారు. ఆ వృద్ధుడు సహజ కారణాలతోనే మరణించాడని, జియావో వైపు ఎలాంటి తప్పిదం లేదని విచారణలో తేల్చారు. అంతేకాకుండా, చైనాలోని ‘గుడ్ సమారిటన్’ (సహాయకుల రక్షణ) చట్టం ప్రకారం.. మంచి ఉద్దేశంతో ఇతరులను కాపాడే ప్రయత్నం చేసేవారికి పూర్తి చట్టపరమైన రక్షణ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. దీంతో వృద్ధుడి కుటుంబ సభ్యులు జియావో వద్ద నుంచి తీసుకున్న రూ.2.68 లక్షల మొత్తాన్ని పూర్తిగా ఆమెకు తిరిగి ఇచ్చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *