“అయ్యో.. రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య కాలు ఇరుక్కుపోయిందే!” రైలు కదిలిన మరుక్షణమే మహిళకు పెను ప్రమాదం.. వెంటనే పరుగెత్తుకొచ్చి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ జవాన్..!

రాజస్థాన్ రాష్ట్రం కిషన్‌గఢ్ రైల్వే స్టేషన్‌లో, కదులుతున్న రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఒక మహిళా ప్రయాణికురాలి కాలు ఇరుక్కుపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

రైలు కదలడం ప్రారంభమైన సమయంలో దిగడానికి ప్రయత్నించిన ఆ మహిళ, అనుకోకుండా రైలు మెట్లకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఇరుక్కుపోయారు. దీంతో రైలుతో పాటు కొంతదూరం ఈడ్చుకెళ్లే ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ నిరంజన్ లాల్ తక్షణమే స్పందించి, ఆ మహిళ ప్రాణాలను కాపాడారు.

మంగళవారం ఉదయం సుమారు 7:45 గంటల సమయంలో జైపూర్ నుంచి ఉదయ్‌పూర్ వెళ్తున్న 20993 నంబర్ రైలు కిషన్‌గఢ్ స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ రైలు తిరిగి బయలుదేరుతుండగా, సోను కుమావత్ అనే మహిళా ప్రయాణికురాలు కిందికి దిగేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ప్రమాదవశాత్తూ ఆమె కాలు రైలు మెట్లకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఇరుక్కుపోయింది. రైలు వేగం పుంజుకుంటుండటంతో ఆమె వెంటనే బయటపడలేకపోయారు. దీంతో అక్కడున్న ప్రయాణికులు, రైల్వే సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

మహిళ ఇరుక్కుపోవడాన్ని గమనించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నిరంజన్ లాల్, వెంటనే రైల్వే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. అంతేకాకుండా, రైలు ఎమర్జెన్సీ (వాక్యూమ్) బ్రేక్ వేసి రైలును ఆపేందుకు చర్యలు తీసుకున్నారు. ఈలోగా అక్కడున్న ప్రయాణికులు కూడా ఆయనకు సాయంగా ముందుకు వచ్చారు. రైలు పూర్తిగా ఆగిపోయిన తర్వాత, ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటన మొత్తం రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

ఈ ప్రమాదంలో సోను కుమావత్ కుడి కాలికి తీవ్ర గాయమైనట్లు సమాచారం. వెంటనే ఆమెను కిషన్‌గఢ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స, అవసరమైన వైద్యం అందించిన అనంతరం ఆమె డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. రైలు కదులుతున్నప్పుడు హడావుడిగా ఎక్కడం లేదా దిగడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి మహిళ ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నిరంజన్ లాల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *