అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రం, కానన్ బీచ్లో సముద్రపు అలజడి కారణంగా ఎగిసిపడిన ఒక భారీ రాక్షస అల, తీరంలో ఉన్న ఒక వ్యక్తిని మరియు అతని పెంపుడు కుక్కను సముద్రంలోకి లాక్కెళ్లిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఆ ప్రాంతంలో ఏర్పడిన ‘కింగ్ టైడ్’ (King Tide) అని పిలిచే సాధారణం కంటే అత్యధిక ఎత్తులో ఎగిసిపడే సముద్రపు అలల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఊహించని విధంగా దూసుకొచ్చిన బలమైన అల వారిద్దరినీ సముద్రంలోకి లాక్కెళ్లింది. ఈ ఘటన ఎకోలా క్రీక్ (Ecola Creek) సమీపంలో చోటుచేసుకోగా, అక్కడే ఉన్న ఒక వ్యక్తి దీనిని వీడియో తీశారు. ఆ దృశ్యాలలో, కుక్క సముద్రపు అలలకు కొట్టుకుపోతుండగా, దాని యజమాని దానిని పట్టుకోవడానికి ప్రయత్నించడం స్పష్టంగా కనిపిస్తోంది. అల వేగంగా దూసుకురావడంతో, కుక్క తాడును వదిలేసిన ఆ వ్యక్తి సమీపంలోని మెట్లను పట్టుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించాడు.
ఈ ఘటనకు కొన్ని గంటల ముందే, ఆ వ్యక్తి బీచ్లో కారు నడుపుతుండగా పోలీసులు అతనిని అడ్డుకుని హెచ్చరించారు. సముద్రం ప్రమాదకరంగా ఉందని, తీరానికి సమీపంలోకి వెళ్లవద్దని సూచించారు. అయినప్పటికీ, సముద్రపు అలలను దగ్గరగా చూడాలనుకుంటున్నానని అతను పోలీసులకు చెప్పాడు. బీచ్లో వాహనం నడిపినందుకు పోలీసులు అతనికి జరిమానా కూడా విధించారు.
అయితే, హెచ్చరికలు చేసిన కొన్ని గంటల్లోనే అతను మరియు అతని పెంపుడు కుక్క సముద్రంలోకి కొట్టుకుపోయారన్న సమాచారం అందడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అదృష్టవశాత్తూ వారిద్దరూ స్వయంగా సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సముద్రం ఉగ్రరూపం దాల్చిన సమయాల్లో ఎత్తైన, సురక్షిత ప్రదేశాల నుండే సముద్రాన్ని వీక్షించాలని, పెంపుడు జంతువులను తీరం అంచుకు తీసుకెళ్లవద్దని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

Leave a Reply