ముంబై-పూణే ఎక్స్ప్రెస్వేపై ప్రయాణిస్తున్న టయోటా ఫార్చ్యూనర్ లగ్జరీ కారు నంబర్ ప్లేట్ క్షణాల్లో మాయమైపోయే దృశ్యం సోషల్ మీడియాలో విడుదలై తీవ్ర కలకలం రేపింది.
ఆ కారులో అమర్చిన ఒక ప్రత్యేక పరికరం సాయంతో, దాని నంబర్ ప్లేట్ను ఒక నల్లటి తెర ఆటోమేటిక్గా కప్పి ఉంచడం ఆ వీడియోలో రికార్డైంది.
ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో, ఆ వాహనం వివరాలపై ఆరా తీయగా పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతివేగంగా నడపడం, ప్రమాదకర రీతిలో డ్రైవింగ్ చేయడం వంటి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఆ కారుపై ఏకంగా 55కి పైగా పెండింగ్ చలానాలు ఉన్నట్లు తేలింది.
వీటికి సంబంధించిన పెండింగ్ జరిమానా మొత్తమే రూ.1 లక్షకు పైగా ఉంది. హైవే కెమెరాలు, ట్రాఫిక్ పోలీసుల ఆటోమేటిక్ నిఘా వ్యవస్థల నుంచి తప్పించుకోవడానికే నిందితులు ఇలాంటి చట్టవిరుద్ధమైన పరికరాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఆ వాహన యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ జోరందుకుంది.
