బంధువులచే ఆదరణకు నోచుకోక ఒంటరిగా జీవిస్తున్న 75 ఏళ్ల వృద్ధుడికి, హిమాచల్ ప్రదేశ్లోని ఒక వృద్ధాశ్రమంలో జీవిత భాగస్వామి దొరికిన హృదయాన్ని హత్తుకునే ఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లా, గాగస్ ప్రాంతంలో ఉన్న ‘అప్నా ఘర్’ వృద్ధాశ్రమంలో నివసిస్తున్న కన్హయ్య లాల్ (75) మరియు సబీనా (63) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులచే నిర్లక్ష్యం చేయబడిన కన్హయ్య లాల్, ఒకప్పుడు గుహలో తలదాచుకుంటూ జీవనం సాగించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా, జీవితంలో ఆధారం లేక దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న సబీనా కూడా ఇదే వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందారు.
వృద్ధాశ్రమంలో వీరిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ మాట్లాడుకునే క్రమంలో, వారి మధ్య ప్రేమ, అవగాహన చిగురించాయి. దీంతో ఇద్దరూ వివాహం చేసుకుని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం, వృద్ధాశ్రమంలోనే వివాహ ఏర్పాట్లు చేసి, హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి జరిపించారు. 75 ఏళ్ల కన్హయ్య లాల్ క్రీమ్ రంగు షేర్వాణీ ధరించి వరుడిగా మెరిసిపోగా, 63 ఏళ్ల సబీనా ఎరుపు రంగు పెళ్లి దుస్తులలో వధువుగా ముస్తాబయ్యారు.
వివాహానికి ముందు రోజు మంగళవారం సాయంత్రం పసుపు రాసే వేడుక (హల్దీ) జరిగింది. వీరిద్దరూ పసుపు రంగు దుస్తులు ధరించి, స్థానిక పర్వత ప్రాంతపు పాటలకు ఎంతో ఉత్సాహంగా నృత్యం చేశారు. వృద్ధాశ్రమంలో ఉంటున్న ఇతర వృద్ధులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. వివాహ సమయంలో నూతన దంపతులకు శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించారు. దీంతో ఆ వృద్ధాశ్రమమంతా పెళ్లి ఇల్లులా కళకళలాడింది.
ప్రేమకు, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వయసు ఏమాత్రం అడ్డంకి కాదని ఈ వివాహం నిరూపించింది. జీవిత చరమాంకంలో ఒంటరిగా ఉన్న వీరిద్దరూ ఒకరికొకరు తోడుగా మారడం ఎంతోమందిని కదిలించింది. కన్నవారి, బంధువుల ఆదరణ లేకపోయినా, వృద్ధాశ్రమంలో చిగురించిన ఈ బంధం వారి జీవితాల్లో కొత్త ఆశను, సంతోషాన్ని నింపింది.

Leave a Reply