సూపర్ మోడల్, టెలివిజన్ ప్రముఖురాలు అయిన హైడీ క్లమ్ (Heidi Klum).. న్యూయార్క్‌లో జరిగిన తన 25వ వార్షిక హాలోవీన్ పార్టీ కోసం రక్తం కారుతున్న భయంకరమైన ‘తెగిపడిన చేయి’ (Severed Hand) వేషంలో వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
గత ఏడాది తన ఎడమ చేతిని చూసుకున్నప్పుడే ఇలా ఒక భారీ చేతిలా మారాలనే ఆలోచన వచ్చిందని ఆమె చెప్పారు. కేవలం కళ్లు, నోరు మాత్రమే కనిపించేలా, అసలు ఆమె ఎవరన్నది గుర్తుపట్టలేని విధంగా ఈ కాస్ట్యూమ్‌లో వచ్చారు.
ఈ వింతైన కాస్ట్యూమ్‌ను తయారు చేయడానికి కొన్ని నెలల సమయం పట్టిందని, పార్టీకి సిద్ధమయ్యే రోజున ముఖానికి కృత్రిమ భాగాలు (ప్రోస్తేటిక్స్) అమర్చుకుని, ఈ దుస్తులు ధరించడానికి సుమారు 5 నుంచి 6 గంటల సమయం పట్టిందని ఆమె తెలిపారు.
ఆమె భర్త టామ్ కౌలిట్జ్ మ్యూజిక్ టూర్లో ఉన్నందున ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు; అయినప్పటికీ, ఆ చేతి వేషంలోని ఉంగరం వేలుపై తన భర్త పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నట్లుగా అత్యంత అద్భుతంగా డిజైన్ చేసి ఆమె తన ప్రేమను చాటుకున్నారు.
గతంలో వానపాము, నెమలి, కాళికామాత అవతారం వంటి పలు విచిత్రమైన వేషాలు వేసి వైరల్ అయిన హైడీ క్లమ్.. ఈ ఏడాది తాను వేసిన కాస్ట్యూమ్‌ను మోయడం చాలా బరువుగా, కష్టంగా అనిపించిందని పేర్కొన్నారు.

Leave a Reply