“అరె.. చొక్కాతో కళ్లద్దాలు తుడుస్తున్నారా..?” పొరపాటున కూడా ఇకపై అలా చేయకండి.. లెన్స్‌ను పాడుచేసే ప్రమాదకర అలవాటు ఇది..!!!

కళ్లద్దాలు ధరించే వ్యక్తులు లెన్స్‌పై దుమ్ము, మురికి లేదా వేలిముద్రలు పడినప్పుడు పెద్దగా ఆలోచించకుండా వేసుకున్న చొక్కా కొంగుతో తుడవడం చాలా సాధారణ అలవాటుగా మారిపోయింది.

ఇది సాధారణ అలవాటులా అనిపించినప్పటికీ, రానురాను కళ్లద్దాల నాణ్యతను పూర్తిగా దెబ్బతీస్తుందని నేత్ర సంరక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనం ధరించే బట్టలు మృదువుగా అనిపించినప్పటికీ, రోజంతా వాటిపై కంటికి కనిపించని ఎన్నో సూక్ష్మ ధూళి కణాలు చేరతాయి. చొక్కాతో తుడిచినప్పుడు ఈ కణాలు లెన్స్‌పై గీసుకుపోతాయి. ఇలా నిరంతరం తుడుస్తూ ఉండడం వల్ల లెన్స్‌పై వేలాది సూక్ష్మ గీతలు (మైక్రో స్క్రాచెస్) ఏర్పడి, దృష్టి స్పష్టత తగ్గి కంటి అలసటకు దారితీస్తుంది.

ప్రస్తుతం వస్తున్న కళ్లద్దాలకు బ్లూ-లైట్, యూవీ (UV) ప్రొటెక్షన్, యాంటీ-రిఫ్లెక్టివ్ వంటి ఎన్నో రకాల ప్రత్యేక రక్షణ పూతలు (కోటింగ్స్) ఉంటాయి. సరైనవి కాని బట్టలతో డ్రైగా (పొడిగా) రుద్ది తుడిచినప్పుడు ఈ ప్రత్యేక పూతలు క్రమంగా దెబ్బతింటాయి. ఒకసారి ఈ పొరలు పాడైతే వాటిని సరిచేయడం సాధ్యం కాదు, చివరకు కొత్త లెన్స్‌లు మార్చాల్సిందే.

ప్రముఖ లెన్స్ తయారీ సంస్థ ‘జీస్’ (ZEISS) పరిశోధన నివేదికల ప్రకారం.. సాధారణ దుస్తులతో నిరంతరం తుడవడం వల్ల లెన్స్ ఉపరితలంపై తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వీటికి బదులుగా ప్రత్యేకమైన మైక్రోఫైబర్ క్లాత్‌ను ఉపయోగించినప్పుడు, ఎటువంటి ఘర్షణ లేకుండా లెన్స్‌పై ఉన్న మురికి చాలా సమర్థవంతంగా తొలగిపోతుంది.

కళ్లద్దాలను ఎప్పుడూ పొడిగా తుడవకుండా, ముందుగా నీటితో కడిగిన తర్వాతే తుడవాలి. లెన్స్ క్లీనర్ లేదా సున్నితమైన లిక్విడ్ సబ్బుతో శుభ్రం చేసిన తర్వాత, ప్రత్యేకమైన మైక్రోఫైబర్ గుడ్డతో నెమ్మదిగా తుడవడమే కళ్లద్దాల నాణ్యతను, దృష్టి స్పష్టతను ఎక్కువ కాలం కాపాడుకోవడానికి సరైన పద్ధతి.


Posted

in

by

Tags: