ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి ప్రాంతంలో ఓ భారీ లారీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏకంగా 308 టైర్లతో ఉన్న ఈ భారీ ట్రక్‌ను చూసేందుకు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు.
ఈ భారీ వాహనం సుమారు 180 టన్నుల బరువున్న భారీ ఇనుప పరికరాన్ని తరలిస్తోంది.
బెల్జియం నుంచి సముద్ర మార్గంలో ఈ భారీ పరికరాన్ని ఒడిశా పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక లారీపై ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ ప్రాంతానికి తరలిస్తున్నారు.
ఒడిశా నుంచి బయలుదేరిన ఈ భారీ ట్రక్… జార్ఖండ్, బీహార్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు చేరుకుంది. మార్గమధ్యంలో ఎక్కడికి వెళ్లినా ఈ లారీని చూసేందుకు ప్రజలు భారీగా గుమిగూడుతున్నారు.
“ఇంత పెద్ద లారీని ఎప్పుడూ చూడలేదు” అంటూ చాలామంది సెల్ఫీలు తీసుకుంటున్నారు. మరికొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ వాహనానికి సోషల్ మీడియాలో “వైరల్ ట్రక్” అనే పేరు కూడా వచ్చేసింది.
ఈ భారీ లారీతో పాటు దాదాపు 40 నుంచి 50 మంది సిబ్బంది కూడా ప్రయాణిస్తున్నారు. వీరు వాహనానికి మార్గదర్శకత్వం ఇవ్వడంతో పాటు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
లారీని చూసేందుకు రోడ్లపై జనం భారీగా చేరుతుండటంతో… ఈ వాహనం రోజుకు కేవలం 10 నుంచి 20 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలుగుతోంది.
ఇక ఈ భారీ ట్రక్ ఒక లీటర్ డీజిల్‌కు సుమారు 4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని సమాచారం.
ఇంత భారీ వాహనం రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా… పోలీసులు కూడా భద్రతా చర్యలు చేపడుతున్నారు.
308 టైర్లు… 180 టన్నుల బరువు… దాదాపు 50 మంది సిబ్బంది…
ఈ భారీ ట్రక్ ఎక్కడికి వెళ్లినా ఇప్పుడు జనాలకు మాత్రం ఒకటే ఆసక్తి…
“ఇంత పెద్ద వాహనం అసలు ఎలా ఉంటుంది?”
అందుకే… భారీ వర్షంలో కూడా రోడ్డు పక్కన నిలబడి మరీ ఈ ‘వైరల్ ట్రక్’ను చూసేందుకు జనం పోటెత్తుతున్నారు.

Leave a Reply