ఢిల్లీలోని ఓ నైట్ క్లబ్‌లో జరిగిన పుట్టినరోజు వేడుకల సందర్భంగా మేనేజర్ భార్యపై అనుకోకుండా బీర్ ఒలికిన వ్యవహారం ఘర్షణకు దారితీసి, ఓ ప్రైవేట్ డ్రైవర్ కొట్టి చంపబడిన అత్యంత దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
నార్త్ ఢిల్లీలోని ఇందర్‌లోక్ ప్రాంతంలో ఉన్న నైట్ క్లబ్‌కు రఘువీర్ నగర్‌కు చెందిన ప్రైవేట్ డ్రైవర్ దల్జీత్ సింగ్ (29) తన స్నేహితులతో కలిసి వెళ్లాడు.
అక్కడ పుట్టినరోజు వేడుకలు జరుగుతుండగా, ప్రమాదవశాత్తు క్లబ్ మేనేజర్ భార్యపై కొద్దిగా బీర్ ఒలికింది. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చెలరేగింది. పరిస్థితి విషమించడంతో క్లబ్ సిబ్బంది, బౌన్సర్లు ఒక్కటై కర్రలు, గాజు బీర్ సీసాలతో దల్జీత్, అతని స్నేహితులపై విచక్షణారహితంగా దాడి చేశారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దల్జీత్ ఎలాగోలా ఇంటికి చేరుకున్నాడు. అనంతరం వాంతులు చేసుకుని పడుకున్నప్పటికీ, పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు అతడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. క్లబ్ మేనేజర్, అతని భార్య, బౌన్సర్లతో సహా మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అంతేకాకుండా, ఈ ఘటనపై స్పందించడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శించినందుకు స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ (స్టేషన్ హౌస్ ఆఫీసర్) పై బదిలీ వేటు వేశారు.

Leave a Reply