మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్ జిల్లా, గాంధీ నగర్ సబ్-హెల్త్ సెంటర్లో అత్యంత అమానవీయమైన ఘటన చోటుచేసుకుంది.
22 ఏళ్ల నిఖిత బైర్వా అనే గర్భిణికి ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక్కసారిగా ప్రసవ వేదన మొదలైంది. కంగారుపడిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే, అక్కడ వారికి ఎదురైన అనుభవం తీవ్ర నిరాశను, దిగ్భ్రాంతిని కలిగించింది.
చలిలో వణుకుతూ, పురిటి నొప్పులతో ఆ మహిళ విలవిల్లాడుతున్నా, ఆసుపత్రి తలుపులను ఆమె కుటుంబ సభ్యులు దాదాపు 30 నిమిషాల పాటు తట్టారు. లోపల సిబ్బంది ఉన్నప్పటికీ ఎవరూ తలుపు తీయలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు చివరకు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. దీనికి సంబంధించిన హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లోపలికి వెళ్లిన తర్వాత కూడా, ప్రమాదకర స్థితిలో ఉన్న ఆ మహిళకు అక్కడి సిబ్బంది ఎటువంటి చికిత్స అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వేరే మార్గం లేక, ఆమెను మోటారు సైకిల్‌పై మరో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ, అక్కడ ఆమెకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల 24 గంటల అత్యవసర సేవల పరిస్థితిని ఈ ఘటన కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఈ నిర్లక్ష్యంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
